ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది

ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు 220 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఇండిగో విమానం బుధవారం ఉదయం పెను ప్రమాదాన్ని తృటిలో తప్పించుకుంది. 6E 2142 నంబరుతో ప్రయాణిస్తున్న ఇండిగో A321 నియో విమానం పఠాన్‌కోట్ సమీపంలో తీవ్ర వడగళ్ల వాన, బలమైన గాలులతో కూడిన ప్రతికూల వాతావరణంలో చిక్కుకుంది. దీంతో విమానం గట్టిగా కుదిపి ప్రయాణికుల్లో ఆందోళనకు గురైంది.

ఈ పరిస్థితుల్లో విమానాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు పైలట్ చొరవ తీసుకొని, అంతర్జాతీయ గగనతలమైన పాకిస్థాన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అనుమతిని కోరగా, పాకిస్థాన్ అధికారాలు అందుకు నిరాకరించాయి. ఈ విషయాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అధికారికంగా ప్రకటించింది.

అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పైలట్ ప్రతిభ చూపుతూ, విమానాన్ని విజయవంతంగా శ్రీనగర్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో విమాన నోస్ కోన్ భాగం తీవ్రంగా దెబ్బతినడం ద్వారా విమానం ఎంత ప్రమాదకర వాతావరణాన్ని ఎదుర్కొన్నదీ స్పష్టమవుతోంది.

ప్రస్తుతం ఈ ఘటనపై DGCA దర్యాప్తు ప్రారంభించింది. ప్రయాణికుల్లో ఎవరూ గాయపడలేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే, అత్యవసర సమయాల్లో పాకిస్థాన్ మానవతా పరంగా స్పందించకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు పాకిస్థాన్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సింధు జలాల ఆపాదనను తెరపైకి తీసుకొస్తున్నారు.

Read More : S -400 డెలివరీలపై కీలక చర్చలు