భారత రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో మరో కీలక అడుగు పడనుంది. అత్యాధునిక ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థల మిగిలిన యూనిట్ల డెలివరీని వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుని భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ రష్యా పర్యటనకు సిద్ధమవుతున్నారు. మే 27 నుంచి 29 వరకు మాస్కోలో జరిగే భద్రతా వ్యవహారాల అంతర్జాతీయ సమావేశంలో పాల్గొనేందుకు అధికారికంగా వెళ్తున్న దోవల్, ఈ సందర్భంగా రష్యా ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా ఎస్-400 వ్యవస్థలపై చర్చించనున్నట్లు సమాచారం.
2018లో భారత్, రష్యాల మధ్య రూ.35 వేల కోట్ల ఒప్పందం కుదిరిన ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు మూడు ఎస్-400 ట్రయంఫ్ యూనిట్లు భారత్‌కు చేరాయి. మిగిలిన రెండు యూనిట్ల డెలివరీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆలస్యం కాగా, ప్రస్తుత భద్రతా పరిస్థితుల నేపథ్యంలో వాటిని త్వరగా అందించాలని భారత్ కృషి చేస్తోంది.
ఇటీవల భారత్-పాకిస్థాన్ మధ్య చోటుచేసుకున్న ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం పెరిగింది. పాకిస్థాన్ వైమానిక దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టడంలో ఎస్-400 వ్యవస్థలు కీలక పాత్ర పోషించాయి. అయితే, ఈ వ్యవస్థలపై పాకిస్థాన్ అసత్య ప్రచారం చేయగా, ప్రధాని మోదీ ప్రత్యక్షంగా స్పందించారు. ఎస్-400 మోహరించిన స్థావరం నుంచి ఫోటో విడుదల చేయడంతోపాటు, భారత సైన్యం కూడా తాము సురక్షితంగా ఉన్నామని స్పష్టం చేసింది.
ఎన్‌పీవో అల్మాజ్ సంస్థ రూపొందించిన ఎస్-400 వ్యవస్థలు, యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ మరియు బాలిస్టిక్ క్షిపణులను 400 కిలోమీటర్ల దూరంలోనే గుర్తించి ధ్వంసం చేయగలవు. ఇది ప్రత్యర్థుల ఎలక్ట్రానిక్ జామింగ్ యత్నాలను కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలదు. ప్రస్తుతం ఈ వ్యవస్థలు భారత వైమానిక దళ పర్యవేక్షణలో పంజాబ్, రాజస్థాన్, ఈశాన్య రాష్ట్రాల్లో మోహరించబడ్డాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో ఎస్-400 మిగిలిన యూనిట్ల డెలివరీలు త్వరగా పూర్తి అయితే, భారత గగనతల రక్షణ మరింత పటిష్టమవుతుందని నిపుణులు భావిస్తున్నారు.
Read More : సుప్రీం కోర్టు బెట్టింగ్ యాప్‌లపై ఆగ్రహం

One thought on “S -400 డెలివరీలపై కీలక చర్చలు”
Comments are closed.