పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఈస్ట్ మేదినిపూర్ జిల్లాలో ఒక హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. కేవలం 13 ఏళ్ల వయసులోనే ఒక చిన్నారి అన్యాయానికి భయపడి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. “అమ్మా, నేను చిప్స్ దొంగలించలేదు” అంటూ సూసైడ్ నోట్ రాసి ఓ 7వ తరగతి బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈస్ట్ మేదినిపూర్‌లోని బకుల్దా ప్రాంతానికి చెందిన కృష్ణనేందు దాస్ అనే బాలుడు అక్కడి ఓ ప్రైవేట్ పాఠశాలలో 7వ తరగతిలో చదువుతున్నాడు. ఇటీవల అతను అదే ప్రాంతంలో ఉన్న ఒక స్వీట్ షాపులోకి వెళ్లి, షాపు ఓనర్ లేనప్పుడు మూడు చిప్స్ ప్యాకెట్లను తీసుకొని బయటికి వచ్చాడు. అనంతరం డబ్బులు చెల్లించినా, దీనిని గమనించిన షాపు ఓనర్ అతనిని నిలదీశారు.
బాలుడు చెల్లించిన డబ్బుల విషయం చెప్పినప్పటికీ, షాపు ఓనర్ వినిపించుకోకుండా అతనిని అందరిముందు దూషించడంతో పాటు కొట్టాడని తెలుస్తోంది. అంతే కాదు, షాపు వద్దనే క్షమాపణ చెప్పించాడట. ఈ దృశ్యాలు బాలుడి మనసులో తీవ్ర మచ్చ వేసినట్టు సమాచారం.
ఈ ఘటనపై బాధిత బాలుడు తన తల్లికి వివరించగా, ఆమె ఆగ్రహంతో షాపు వద్దకు వెళ్లి ఓనర్‌తో వాగ్వాదానికి దిగింది. అనంతరం ఇంటికి వచ్చి తీవ్ర మనోవేదనకు గురైన బాలుడు ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ అతను ప్రాణాలు కోల్పోయాడు.
బాలుడు మరణించే ముందు రాసిన సూసైడ్ నోట్‌లో “అమ్మా, నేను చిప్స్ దొంగలించలేదు” అనే వాక్యం చదివిన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమారుడు మరణానికి షాపు ఓనరే కారణమని ఆరోపిస్తూ, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలుడి మరణం నేపథ్యంలో సమాజంలో పిల్లలపై ఒత్తిడులు, తప్పుడు నిందల ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందనే విషయంలో చర్చ మొదలైంది.

Read More : ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది

One thought on “Chips : దురదృష్టకరంగా ఆత్మహత్య”
Comments are closed.