కర్ణాటకలో సీఎం మార్పు అంశం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎమ్మెల్యేలతో కీలక భేటీ నిర్వహించగా, ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలకు దారితీసింది. తాజాగా అభివృద్ధి కార్యక్రమాల కోసం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్ల గ్రాంట్ కేటాయిస్తున్నట్లు సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ నిధుల కేటాయింపుపై చర్చించేందుకు ఆయన విధానసౌధలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
అయితే, డీకే శివకుమార్ గైర్హాజరు కావడం వివిధ ఊహాగానాలకు దారితీస్తోంది. కాంగ్రెస్ వర్గాల్లో కొందరు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తుండగా, అధికార వర్గాలు మాత్రం ఇది కొత్త విషయం కాదని చెబుతున్నాయి. గతంలో కూడా డీకే శివకుమార్ పలు సమావేశాలకు హాజరు కాలేదని వారు గుర్తు చేస్తున్నారు.
ఇక, ఆయన ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నందునే హాజరు కాలేకపోయారని మరికొందరు పేర్కొంటున్నారు. సాధారణంగా ఇలాంటి సమావేశాలు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో నిర్వహిస్తారు. కానీ, ఈసారి విధానసౌధలో సీఎం ఛాంబర్‌లో నిర్వహించడం డీకే శివకుమార్‌ను దూరం పెట్టడానికేనేమో అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ పరిణామాలు కర్ణాటక కాంగ్రెస్‌లో జరుగుతున్న అంతర్గత రాజకీయ చర్చలను మళ్లీ వెలుగులోకి తెచ్చాయి.
Read More : ప్రాక్టర్ & గాంబుల్ కొత్త సీఈవోగా శైలేష్ జేజూరికర్
