ఆంధ్రప్రదేశ్‌లో యోగాంధ్ర మాసోత్సవాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (Yoga International Day) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం మీడియాతో మాట్లాడుతూ, యోగా భారతదేశం ఇచ్చిన గొప్ప సంపదగా పేర్కొన్నారు. యోగా అంతర్జాతీయ గుర్తింపు పొందడానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రాధాన్య పాత్ర పోషించారని అభినందించారు.

చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, యోగా కొందరికి మాత్రమే సంబంధించినది కాదని, ఇది ప్రతి ఒక్కరి జీవితం లో భాగంగా మారాలని అన్నారు. యోగా ద్వారా మెరుగైన జీవనశైలి ఏర్పడుతుందని, ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వివరించారు. యోగా దినోత్సవం సందర్భంగా ఫొటోస్ తీసుకునే కార్యక్రమంగా కాకుండా, జీవితం లో స్థిరమైన మార్పు తెచ్చే ఉద్యమంగా చూడాలని ప్రజలను కోరారు.

‘యోగాంధ్ర – 2025’ ప్రచారం ప్రారంభం

మే 21 నుంచి జూన్ 21 వరకు “యోగాంధ్ర – 2025” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఒక నెల పాటు ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మంది ప్రజలు పాల్గొనేలా కార్యాచరణ రూపొందించారని తెలిపారు. జూన్ 21న విశాఖపట్నం రామకృష్ణ బీచ్‌లో ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రత్యేక యోగా కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో 5 లక్షల మంది పాల్గొననున్నారు.

ఈ యోగా ఉద్యమానికి ప్రోత్సాహంగా 10 లక్షల మందికి యోగా సర్టిఫికెట్లు ఇవ్వనున్నట్లు సీఎం వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. యోగాలో శిక్షణ పొందిన 2,500 మంది మాస్టర్ ట్రైనర్లను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.

జూన్ 21న విశాఖ బీచ్‌లో మోదీ, చంద్రబాబు పాల్గొననున్నారు

జూన్ 21న విశాఖపట్నం ఆర్‌కే బీచ్‌లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు. ఈ వేడుకల్లో రాష్ట్రస్థాయి ప్రముఖులు, యోగా ఔత్సాహికులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.

ప్రతి గ్రామం, వార్డు స్థాయిలో అవగాహన

ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో, వార్డు స్థాయిలో ప్రజలకు యోగా ప్రయోజనాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. యోగాను ప్రతిఒక్కరి జీవితశైలిలో భాగం చేసుకోవాలని సూచించారు. విజయవాడ హరిత బెరంపార్కులో ప్రారంభమైన ఈ ప్రచార కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీష, ఆయుష్ డైరెక్టర్ దినేష్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Read More : జిల్లాల పునర్విభజనపై సీఎం కీలక నిర్ణయం

One thought on “ఆంధ్రప్రదేశ్‌లో యోగాంధ్ర మాసోత్సవాలు ప్రారంభం

Comments are closed.