ఏపీ రాజకీయాల్లో మరోసారి వేడి చల్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాజంపేట నియోజకవర్గంలోని బోయనపల్లిలో జరిగిన ప్రజావేదిక సభలో మాట్లాడుతూ, గత ఐదేళ్ల వైసీపీ పాలనపై చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. “ఎన్నికల ముందు ‘సిద్ధం సిద్ధం’ అని నినాదాలు చేసిన వారు నిజంగా సిద్ధమేనా? దమ్ముంటే అసెంబ్లీకి రండి.. ఎవరిది అభివృద్ధి, ఎవరిది విధ్వంసం అనేది ప్రజల ముందే తేల్చుకుందాం” అని ఆయన సూటిగా సవాల్ విసిరారు.
చర్చకు తాను సిద్ధమని స్పష్టం చేసిన చంద్రబాబు, “బాబాయ్ హత్య, పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలు, దళిత డ్రైవర్ హత్య, కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామా… ప్రతీ అంశంపైనా మాట్లాడుకుందాం. నేను ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సిద్ధమే, వైసీపీ సిద్ధమేనా?” అంటూ నిలదీశారు. తనపై మైన్ల దాడులు జరిగినా చలించలేదని, తాను డ్రామాలు ఆడే నాయకుడు కాదని పేర్కొన్నారు. తర్వాత బోయనపల్లి గ్రామంలో పెన్షన్ పంపిణీ చేసిన చంద్రబాబు, “పెన్షన్ అనేది పేదలకు దానం కాదు, ప్రభుత్వ బాధ్యత. తెలుగు వారికి పెన్షన్లు అందించింది ఎన్టీఆర్. ఆయన రూ.30తో మొదలు పెట్టగా, మేం ఇప్పుడు రూ.4000 ఇస్తున్నాం. దివ్యాంగులకు 12 రెట్లు పెంచినదీ టీడీపీ ప్రభుత్వమే” అని గుర్తుచేశారు. వైసీపీ పాలనలో అనర్హులు కూడా పెన్షన్లు పొందారని, అటువంటి వారిని ప్రజలే ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.
ఆర్థిక వ్యవస్థపై మాట్లాడుతూ, “అప్పులు చేసి పప్పు కూడు తింటే చివరికి చిప్పే మిగులుతుంది. సంపద సృష్టిస్తేనే సంక్షేమం సాధ్యం. ఐటీ, హైటెక్ సిటీని ఎగతాళి చేసిన వారు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే కారణం అదే ఐటీ” అని స్పష్టం చేశారు. మహిళలను డ్వాక్రా సంఘాలతో ఆర్థికంగా బలపరిచినదీ టీడీపీ ప్రభుత్వమేనని గుర్తుచేశారు.
రాయలసీమ అభివృద్ధిపై చంద్రబాబు హామీ ఇస్తూ, “రాయలసీమను రత్నాల సీమగా తీర్చిదిద్దుతాం. సీమలో కరవును శాశ్వతంగా తొలగిస్తాం. కుప్పానికి నీళ్లిచ్చాం, త్వరలో రాజంపేట, కోడూరుకు కూడా నీళ్లు అందిస్తాం. అనంతపురంలో కియా పరిశ్రమతో అభివృద్ధి తెచ్చినట్లే, రాయలసీమకు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తాం” అన్నారు.
తన బలం ప్రజలేనని, వారి సహకారంతో రాష్ట్రాన్ని ప్రగతి దిశగా నడిపిస్తానని స్పష్టం చేశారు.
Read More : పవన్ మాట చెల్లడం లేదా?

One thought on “చంద్రబాబు బహిరంగ సవాల్ – అసెంబ్లీకి రండి.. ?”
Comments are closed.