పోలవరం ప్రాజెక్టు, బనకచర్లకు కేంద్ర సహాయం కోరిన సీఎం చంద్రబాబు

విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకున్న అనంతరం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో రాష్ట్రానికి కీలకమైన నీటిపారుదల ప్రాజెక్టులకు కేంద్రం పూర్తి స్థాయిలో సహకారం అందించాలని కోరారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధుల విడుదల, పనుల పురోగతిపై మంత్రి పాటిల్‌తో సీఎం చర్చించినట్లు సమాచారం. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు తొలి దశను పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్నదని చంద్రబాబు తెలిపారు. ప్రాజెక్టు పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు మంత్రి పాటిల్‌ను ఆహ్వానించారు.

అలానే రాయలసీమ రైతులకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చడంలో కీలకమైన బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం నుండి అనుమతులు మంజూరు చేయాలని, అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. గోదావరి వరద జలాలను పోలవరం ద్వారా పెన్నా నదికి అనుసంధానించే ప్రణాళికపై కేంద్రానికి వివరించారు.

ఈ భేటీలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కృష్ణ ప్రసాద్, అప్పలనాయుడు, హరీష్ బాలయోగి, సానా సతీష్ తదితరులు సీఎం చంద్రబాబుకు మద్దతుగా పాల్గొన్నారు.

రాష్ట్ర అభివృద్ధిలో నీటిపారుదల ప్రాజెక్టుల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని కేంద్రం నుంచి సానుకూల స్పందన లభిస్తుందనే విశ్వాసాన్ని ఏపీ ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది.

Read More : ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ విడుదల

One thought on “పోలవరం ప్రాజెక్టు, బనకచర్లకు కేంద్ర సహాయం కోరిన సీఎం చంద్రబాబు

Comments are closed.