తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ మరో శుభవార్తను అందించింది. భక్తుల సౌకర్యార్థం తిరుపతి నుండి అలిపిరి, శ్రీవారి మెట్టు కాలినడక మార్గాల వరకు ఉచితంగా 20 ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం తిరుపతి బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాల నుంచి బస్సులు నడిపేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఈ కొత్త పద్ధతితో కాలినడక భక్తులకు ప్రయాణంలో గల ఇబ్బందులు తీరే అవకాశముంది. ఇప్పటికీ టీటీడీ ఆధ్వర్యంలో ఉచిత ధర్మరథ బస్సులు ఉన్నాయి కానీ, భక్తుల పెరిగిన సంఖ్యకు తగిన సంఖ్యలో వాహనాలు అందుబాటులో లేవు. దీన్ని అవకాశంగా మలచుకుని ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు అధిక చార్జీలు వసూలు చేస్తున్న పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలో జరగనున్న ధర్మకర్తల మండలి సమావేశంలో దాతల సహకారంతో ఈ బస్సుల కొనుగోలు విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు.
తిరుపతిలో పుష్పయాగం వైభవం
ఇక తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శనివారం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో శాస్త్రోక్తంగా తిరుమంజనం నిర్వహించారు.
సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఊంజల మండపంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య పుష్పయాగం ఘనంగా సాగింది. తులసి, చామంతి, మల్లెలు, రోజా, తామర, కలువ వంటి 12 రకాల పూలతో పాటు ఆరు రకాల ఆకులతో మొత్తం మూడు టన్నుల పుష్పాలతో స్వామి, అమ్మవార్లకు యాగం చేశారు.
Read More : రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్

3 thoughts on “తిరుమల :ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి!”
Comments are closed.