పవన్ కల్యాణ్ ఆదేశం: విశాఖలో జె.ఈ.ఈ పరీక్షకు ఆలస్యంపై సమగ్ర విచారణ జరపండి..

విశాఖపట్నంలోని పెందుర్తి ప్రాంతంలో జరిగిన జె.ఈ.ఈ మెయిన్‌ పరీక్షకు కొందరు విద్యార్థులు సకాలంలో చేరుకోలేకపోయిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. తన కాన్వాయ్ కారణంగా విద్యార్థులు పరీక్షకు ఆలస్యం అయ్యారన్న వార్తా కథనాలను పరిగణనలోకి తీసుకుంటూ, పవన్ కళ్యాణ్ ఈ అంశంపై సమగ్ర విచారణ చేపట్టాలని విశాఖ పోలీసు అధికారులను ఆదేశించారు.

పరీక్ష కేంద్రం ప్రాంతంలోని ట్రాఫిక్ పరిస్థితి, కాన్వాయ్ కారణంగా ఎలాంటి అడ్డంకులు తలెత్తాయా? సర్వీసు రోడ్లపై ట్రాఫిక్ నియంత్రణ జరిగిందా? అనే అంశాలపై వివరంగా విచారించాలని అధికారులను కోరారు. ఇందుకు సంబంధించిన నివేదికను త్వరితగతిన అందజేయాలన్నారు.

ఇక ఘటనకు సంబంధించి, విశాఖ నగర పరిధిలోని చినముషిడివాడలో ఉన్న ఐయాన్ డిజిటల్ పరీక్షా కేంద్రానికి నలుగురు విద్యార్థులు సకాలంలో చేరుకోలేకపోవడంతో పరీక్షకు అనుమతి లేకుండా తిరస్కరించారని తెలుస్తోంది. విద్యార్థుల ప్రకారం, ఉదయం 8:30 గంటలలోగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉండగా, ట్రాఫిక్ అంతరాయాల వల్ల ఆలస్యమయ్యిందని వారు తెలిపారు.

అయితే, ఈ ఆరోపణలను ట్రాఫిక్ పోలీసులు ఖండించారు. బీఆర్టీఎస్‌ సర్వీస్‌ రోడ్డులో ఎక్కడా ట్రాఫిక్ నిలిపివేయలేదని, కాన్వాయ్ సమయంలో రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్‌ కూడా విడుదల చేశారు.

ఇదిలాఉంటే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉత్తరాంధ్ర ఏజెన్సీ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1,005 కోట్ల వ్యయంతో 1,069 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

Read More : సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై మరో కేసు నమోదు ..