ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, నాయకులతో సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పలు కీలక సూచనలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. పాలనలో స్పష్టమైన మార్పులు ప్రజలకు కనిపిస్తున్నాయన్నారు.
జిల్లాల్లో మంత్రుల పర్యటనలు తప్పనిసరి
సీఎం చంద్రబాబు తన సూచనల్లో కీలకంగా జిల్లాల్లో మంత్రులు తప్పనిసరిగా పర్యటించాలని ఆదేశించారు. అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులతో సమీక్షలు జరపాలని సూచించారు. జిల్లాల్లో పర్యటించే సమయంలో ఆయా జిల్లా కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. గ్రూప్ రాజకీయాలకు తావు ఇవ్వకుండా కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
వైసీపీ నేతలతో ఎలాంటి సంబంధాలు వద్దు
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఏ స్థాయిలోనూ వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోరాదని స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ ఏ రాజకీయ వివక్ష ఉండకూడదనే అభిప్రాయంతోనే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని చెప్పానని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అమలు చేయాలన్నారు.
నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టి
నామినేటెడ్ పదవుల భర్తీకి 60 వేల దరఖాస్తులు అందాయని, వీటిని నిశితంగా పరిశీలిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఎన్నికల్లో పార్టీకి సేవ చేసిన వారికి నామినేటెడ్ పదవులలో ప్రాధాన్యం ఇస్తామన్నారు. మొదటి విడత పదవులు పొందని వారికి రెండో విడతలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 21 ప్రధాన దేవాలయాలకు చైర్మన్‌లను నియమిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
సోలార్ విద్యుత్ పై ప్రత్యేక దృష్టి
‘పీఎం సూర్యఘర్’ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా అమలు చేసేందుకు ఎమ్మెల్యేలు, నేతలు చొరవ చూపాలని సీఎం చంద్రబాబు సూచించారు. బీసీలకు 2 కిలోవాట్ల రూఫ్‌టాప్ సౌర విద్యుత్ వ్యవస్థపై రూ. 20 వేల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం అదనంగా అందిస్తుందని, ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా ఈ సౌర విద్యుత్ పథకం అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం 10 వేల రూఫ్‌టాప్ సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటే లక్ష్యంగా పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.
“ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నామో.. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే హుందాగా, జాగ్రత్తగా వ్యవహరించాలని” సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

One thought on “ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నామో ఇప్పుడూ అంతే హుందాగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు సూచనలు”
Comments are closed.