అమరావతిలో రాజధాని నిర్మాణానికి వేగం పెరగనుందా? సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు

CRDA meeting

రాజధాని అమరావతి అభివృద్ధిలో కీలకమైన ముందడుగు పడనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన మంగళవారం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో సీఆర్డీఏ (CRDA) 45వ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో రాజధాని నిర్మాణానికి సంబంధించిన వేల కోట్ల రూపాయల పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.

అమరావతి రాజధాని పనుల కోసం ఇప్పటికే రూ.40 వేల కోట్ల విలువైన టెండర్లను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ పనులకు సంబంధించిన ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ (Letter of Agreement) ఇవ్వాలని సీఆర్డీఏ అధారిటీ ఈ సమావేశంలో ఆమోదం తెలపనుంది. అంగీకారం లభించిన వెంటనే ఆయా ఏజెన్సీలతో ఒప్పందాలు చేసుకుని రాజధాని నిర్మాణ పనులను పెద్ద ఎత్తున ప్రారంభించనున్నారు.

ఈ సమావేశంలో మంత్రి నారాయణ (Minister Narayana), మున్సిపల్ శాఖ, సీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. రాజధాని పనుల వేగవంతానికి సంబంధించిన కీలక అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అమరావతి నిర్మాణానికి వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ కలిసి రూ.13,400 కోట్ల రుణాన్ని మంజూరు చేయగా, హడ్కో (HUDCO) నుంచి మరో రూ.11 వేల కోట్ల రుణానికి అనుమతి లభించింది. అదనంగా జర్మనీకి చెందిన ఆర్థిక సంస్థ నుంచి రూ.5 వేల కోట్లు, కేంద్ర ప్రభుత్వంనుంచి రూ.1500 కోట్లు గ్రాంట్‌గా పొందనున్నారు.

సంఖ్యలో రూ.31 వేల కోట్ల నిధులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద రైతులకు ఇచ్చిన ప్లాట్స్‌లో రోడ్లు, మౌలిక సదుపాయాల పనులను మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. రెండేళ్లలో ప్రధాన రహదారులను పూర్తి చేస్తామనీ, సెక్రటేరియట్, అసెంబ్లీ వంటి ఐకానిక్ టవర్స్‌ను మూడేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఈరోజు జరగనున్న సీఆర్డీఏ సమావేశం అత్యంత కీలకంగా మారింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా అమరావతిలో రాజధాని పనులు మరింత వేగవంతం కానున్నాయి.

Read More

One thought on “అమరావతిలో రాజధాని నిర్మాణానికి వేగం పెరగనుందా? సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు

Comments are closed.