సంక్రాంతి ప్రత్యేక బస్సులు: ఆర్టీసీ ప్రణాళిక
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ వెల్లడించారు.
జనవరి 8 నుంచి జనవరి 13 వరకూ ప్రత్యేక బస్సుల సేవలను అందించనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు 2,153 బస్సులు, బెంగళూరు నుంచి 375 బస్సులు, విజయవాడ నుంచి 300 బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు.
తిరుగు ప్రయాణానికి ఈ నెల 16 నుంచి 20 వరకూ 3,200 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలను వసూలు చేయబోమని, సాధారణ ఛార్జీలతోనే ప్రయాణం చేయవచ్చని స్పష్టం చేశారు.
అలాగే, ఒకేసారి రెండు వైపులా టికెట్లు బుక్ చేసుకుంటే (APSRTC Online Booking) టికెట్ ధరపై 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఎండీ వెల్లడించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం చేయాలని కోరుతూ ప్రయాణికులకు ముందస్తు టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించామని చెప్పారు.
