రేషన్ బియ్యం మాయం కేసు: అరెస్టులు కొనసాగుతున్నాయి..
కృష్ణాజిల్లా, మచిలీపట్నం: రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయం కేసులో రైస్ మిల్లర్ బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్ బోట్ల మంగారావులను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.
కేసు విచారణలో భాగంగా సివిల్ సప్లయిస్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే గోడౌన్ మేనేజర్ మానస తేజా అరెస్టు కావడం తెలిసిందే. కోటిరెడ్డి ప్రమేయంపై అనుమానాలతో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కోటిరెడ్డి తనపై అనుమానం రాకుండా ముందుగానే ఫిర్యాదు చేసినట్లు భావిస్తున్నారు. నిందితులను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా, 12 రోజుల రిమాండ్ విధించారు.
పేర్ని జయసుధకు ముందస్తు బెయిలు..
రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధకు కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. కోర్టు ఆమెను విచారణకు సహకరించాలని ఆదేశించింది. గోడౌన్లలో నిల్వ బియ్యానికి, పత్రాల్లో ఉన్న నిల్వలకు వ్యత్యాసం గుర్తించడంతో, ఆమె ప్రభుత్వం ఖజానాకు రూ. 1.79 కోట్ల డీడీ చెల్లించారు.
తదుపరి విచారణలో మొత్తం 378 మెట్రిక్ టన్నుల బియ్యం షార్టేజ్ ఉన్నట్లు గుర్తించారు. అదనంగా రూ. 1.67 కోట్ల డబ్బు చెల్లించాలంటూ జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ నోటీసులు జారీ చేశారు.
రాజకీయాలపై ప్రభావం..
పేర్ని నాని గతంలో వైసీపీ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. తనదైన శైలిలో ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించిన ఆయన, ఈ కేసు కారణంగా ఇప్పుడు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. రేషన్ బియ్యం మాయం కేసులో తమ తప్పిదం ఒప్పుకున్నట్లు ప్రభుత్వానికి కోట్లు చెల్లించడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంపై పేర్ని కుటుంబం ఎలా స్పందిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
