వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులపై సుప్రీంకోర్టు ఆదేశాలు

దిల్లీ: వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan) అక్రమాస్తుల కేసులపై పూర్తి వివరాలు అందించాలని సుప్రీంకోర్టు (Supreme Court) సీబీఐ, ఈడీలను ఆదేశించింది. ఈ కేసుల వివరాలను 2 వారాల్లోగా సమర్పించాలని స్పష్టం చేసింది. కింది కోర్టులో పెండింగ్‌లో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలను, అలాగే తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్ల వివరాలను అందించాలని ఆదేశించింది. సీబీఐ, ఈడీ కేసుల వివరాలను విడివిడిగా చార్ట్ రూపంలో ఇవ్వాలని కోర్టు సూచించింది. అన్ని వివరాలతో అఫిడవిట్లు 2 వారాల్లోగా దాఖలు చేయాలని తెలిపింది.జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఆలస్యమవుతోందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు గతంలో పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ అభయ్ ఎస్. ఓకా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనల సమయంలో, రోజువారీ పద్ధతిలో విచారణకు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఆదేశించిన విషయాన్ని ఇరుపక్షాల న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.విచారణ ఇన్నేళ్ల పాటు ఎందుకు ఆలస్యమవుతోందని ధర్మాసనం ప్రశ్నించగా, డిశ్చార్జ్ పిటిషన్లు, వాయిదా పిటిషన్లు, అలాగే ఉన్నత కోర్టుల్లో విచారణ పెండింగులో ఉండటం ప్రధాన కారణమని న్యాయవాదులు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను సమర్పిస్తే తగిన ఆదేశాలు ఇస్తామని కోర్టు తెలిపింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు, ట్రయల్ కోర్టు మరియు పెండింగ్ కేసుల వివరాలను సమగ్రంగా అందించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది.