ముక్కోటి ఏకాదశి: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం

ముక్కోటి ఏకాదశి: తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు

తిరుమల: ముక్కోటి ఏకాదశి అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు అధిక ప్రాముఖ్యత ఇస్తారు. శుక్రవారం తెల్లవారుజాము 3 గంటల నుంచి తిరుమలలో శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు భక్తులకు తెరుచుకున్నాయి. ఈ నెల 19 వరకు వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అధికారులు భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

వైకుంఠ ద్వార దర్శనం
ఈ 10 రోజుల పాటు ఆలయంలో జరిగే ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు. కేవలం దర్శనం టికెట్ లేదా టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శన అనుమతి ఉంది. శుక్రవారం ఉదయం అర్చకులు శ్రీవారికి ఏకాంత అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం ఉదయం 4.30 గంటల నుంచి ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. ఉదయం 8 గంటల నుంచి సామాన్య భక్తులకు దర్శనం ప్రారంభమైంది.

ఉదయం 9 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణ రధంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వాహన మండపంలో ఉత్సవమూర్తులు భక్తులకు దర్శనం ఇచ్చారు.

సింహాచలం క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి
విశాఖపట్నంలోని సింహాచలం క్షేత్రంలో శుక్రవారం తెల్లవారుజాము ఉత్తర ద్వార దర్శనం వైభవంగా ప్రారంభమైంది. సింహాద్రి అప్పన్న స్వామి ఉత్తర ద్వారంలో వైకుంఠనాధుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. పూసపాటి అశోక్ గజపతిరాజు, ఇతర ప్రముఖులు దర్శనం చేసుకున్నారు.

నెల్లూరులో ముక్కోటి ఏకాదశి
నెల్లూరులో ప్రసిద్ధి చెందిన శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. ప్రత్యేక దర్శనాలను రద్దు చేసి భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేశారు.

వీఐపీలు శ్రీవారి దర్శనం
తిరుమలలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, సినీ నటులు, ఇతర ప్రముఖులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.

ఈ రోజు భక్తులకోసం
ముక్కోటి ఏకాదశి ఉపవాసం, జాగరణతో భగవంతుని కీర్తనలు, భాగవత కథలు వినడం విశేష ఫలితాలను కలిగిస్తుందని భక్తులు నమ్ముతారు.