రాజలింగమూర్తి హత్యపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, ఫిబ్రవరి 20: సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ హత్యను ఖండిస్తూ, దీనిపై సీబీసీఐడీ దర్యాప్తు జరిపించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. పోలీసులు ఈ కేసును త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. 24 గంటల్లోనే నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఈ హత్య కేసును ఫాస్ట్రాక్ కోర్టులో విచారణ జరిపిస్తామని తెలిపారు.
రాజలింగమూర్తిని గండ్ర వెంకట రమణా రెడ్డి హత్య చేయించారని ఆరోపించిన ఆయన, ఈ ఘటన వెనుక కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఉన్నారని విమర్శలు గుప్పించారు. “తెలంగాణలో మీరు ఎలా పుట్టారో అర్థం కావడం లేదు. బీఆర్ఎస్ హత్యా రాజకీయాలకు ప్రోత్సాహం ఇస్తోంది. ఇది తెలంగాణ సంస్కృతి కాదు. దోపిడీని ప్రశ్నిస్తే హత్య చేసే స్థాయికి దిగజారడం బాధాకరం” అని మండిపడ్డారు.
“సామాజిక కార్యకర్తను హత్య చేసేవాళ్లకు శిక్ష తప్పదు”
మేడిగడ్డ అక్రమాలపై రాజలింగమూర్తి కోర్టులో పోరాడుతున్నాడని, అందుకే ఆయనను హత్య చేశారని కోమటిరెడ్డి ఆరోపించారు. “నీళ్లు పోసుకుని పెట్రోల్ అని చెప్పి అమాయకుల ప్రాణాలు తీసిన ఘటనకు హరీష్ రావు కారణం. దోపిడి బయట పడుతుందనే భయంతోనే ఈ హత్యలు చేస్తున్నారు. ప్రశ్నిస్తే చంపేస్తారా?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల హత్యకు గురైన అడ్వకేట్ వామన రావును హత్య చేసిన వారికే కేసీఆర్ టికెట్ ఇచ్చారని ఆరోపించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కూడా ఈ హత్యను తీవ్రంగా ఖండించారు. హత్య వెనుక సుపారీ వ్యవహారం ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు. “హత్యా రాజకీయాలు భూపాలపల్లిలో ఉపేక్షించబడవు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని ఆయన పేర్కొన్నారు.
ఈ హత్య కేసును నిర్దాక్షిణ్యంగా విచారించి, బాధ్యత వహించిన వారిని శిక్షించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Our YouTube Channel Click Here

2 thoughts on “రాజలింగమూర్తి హత్యపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు”
Comments are closed.