ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ
గురువారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు ముఖ్యమైన అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. గత ఆరు నెలల పాలనను సమీక్షించి, రానున్న ఏడాది పాలనకు కావాల్సిన మార్పులు, సంస్కరణలపై సీఎం మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఎస్‌ఐపిబి అమోదం పొందిన పెట్టుబడులు
ఈ భేటీలో, ఎస్‌ఐపిబి ఇప్పటికే ఆమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు మంత్రి మండలి తుది ఆమోదం తెలపనుంది. ఈ పెట్టుబడుల ద్వారా 2,63,411 మందికి ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో రూ. 96,862 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ భారీ రిఫైనరీ స్థాపనకు కూడా క్యాబినెట్ అంగీకారం తెలపనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2,400 మందికి ఉద్యోగాలు కలుగుతాయి.
విశాఖపట్నం మిలీనియం టవర్స్
విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్‌లో టీసీఎస్ సంస్థ రూ. 80 కోట్ల పెట్టుబడులతో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆమోదం పొందనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2,000 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి.
శ్రీ సత్యసాయి జిల్లా
గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ సంస్థ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్‌ల తయారీ కోసం రూ.1,046 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ అంగీకారం తెలపనుంది. దీని ద్వారా 2,381 మందికి ఉపాధి లభించనుంది.
రాంబిల్లి ప్రాజెక్ట్
అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.1,174 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలో కొత్తగా ఐదు సంస్థలు క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం రూ.83,000 కోట్ల పెట్టుబడులు చేయనున్నాయి.
గోదావరి టూ బనకచర్ల ప్రాజెక్టు
ముఖ్యమంత్రికి అత్యంత ప్రాధాన్యమైన నదుల అనుసంధాన ప్రాజెక్టు గోదావరి టూ బనకచర్లపై కూడా క్యాబినెట్ చర్చించనుంది. మంత్రుల పనితీరు నివేదికలను సమీక్షించిన సీఎం, తన దగ్గర ఉన్న విశ్లేషణలను కలిపి క్యాబినెట్‌లో చర్చించనున్నారు.
మరో ఏడాది పాలనకు ప్రణాళికలు
గడిచిన ఆరు నెలల పాలనలోని ముఖ్యమైన అంశాలను చర్చించి, రానున్న ఏడాది కోసం ఆచరణ చర్యలు రూపొందించేందుకు ఈ సమావేశం కీలకంగా నిలుస్తుంది.
