ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను విజయవాడలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఉద్దండరాయునిపాలెం ప్రాంతాన్ని సందర్శించేందుకు షర్మిల సిద్ధమవుతుండగా, పోలీసులు ఆమెను ఇంటి నుంచే అడ్డుకున్నారు. దీనితో ఆమె నివాసం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
పరిస్థితుల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…
2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంను సందర్శించాలని షర్మిల యోచించారు. ఈ మేరకు ఆమె పర్యటనకు సిద్ధమవుతున్న సమయంలో పోలీసులు మౌకికంగా నో చెప్పారు. షర్మిల పర్యటనకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు.
షర్మిల ఇంటి బయట బారికేడ్లు ఏర్పాటు చేసి, ఆమె బయటకు రావకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ సమయంలో షర్మిల, పోలీసులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల తీరుపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ – “నన్నెందుకు అడ్డుకుంటున్నారు? ఉద్దండరాయునిపాలెం వెళ్లి తీరుతాను. ఇది నా హక్కు,” అంటూ వ్యాఖ్యానించారు.
అయితే, పోలీసులు ఆమెను బయటకు వెళ్లనివ్వకుండా గృహ నిర్బంధంలో ఉంచారు. షర్మిల నివాసం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
Read More : PM దిగ్భ్రాంతి, పరిహారం ప్రకటించారు
