విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ చూపిన చొరవ, కృషిని ప్రత్యేకంగా అభినందించారు.
ప్రధాని మోదీ ప్రకటనలో, గత ఒక నెల రోజులుగా యోగా దినోత్సవం ఏర్పాట్లను మంత్రి లోకేశ్ వ్యక్తిగతంగా పర్యవేక్షించారని గుర్తుచేశారు. ఆయన నిరంతర నిఘా, పట్టుదల వల్లే ఈ కార్యక్రమం అత్యంత విజయవంతంగా నిర్వహించగలిగామని ప్రశంసించారు.‘యోగాంధ్ర’ పేరిట నిర్వహించిన ఈ విశాల కార్యక్రమం ద్వారా అన్ని వర్గాల ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో లోకేశ్ ముందుండారని ప్రధాని పేర్కొన్నారు. యోగా కేవలం ఆరోగ్యానికి సంబంధించిన సాధనగా మాత్రమే కాకుండా, సామాజిక ఐక్యతకు దోహదపడే సామూహిక ఉత్సవంగా ఎలా మారుతుందో విశాఖలో చూపించగలిగారని అన్నారు.ఈ కార్యక్రమాల ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యమే కాకుండా, సమాజంలో ఐక్యత, సామరస్యాన్ని పెంపొందించేందుకు యోగా ఎంతగానో ఉపయుక్తమని మోదీ అభిప్రాయపడ్డారు. విశాఖలో నిర్వహించిన యోగా దినోత్సవ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని ఆయన ప్రశంసించారు.
Read More : విశాఖ యోగాంధ్ర కార్యక్రమానికి గిన్నిస్ వరల్డ్ రికార్డు గౌరవం
