తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం ప్రకటించారు. త్వరలో పార్టీ తరఫున ప్రత్యేక మొబైల్ యాప్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ యాప్ ద్వారా ప్రభుత్వ వేధింపులు లేదా అన్యాయాలకు గురైన వారు నేరుగా ఫిర్యాదులు చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. జగన్ మాట్లాడుతూ, “త్వరలోనే పార్టీ యాప్ విడుదల చేస్తాం. ఎవరి కారణంగా అయినా అన్యాయం జరిగితే, వెంటనే ఆ యాప్‌లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు. ఫిర్యాదుతో పాటు ఆధారాలు కూడా అప్‌లోడ్ చేయవచ్చు. ఈ సమాచారం నేరుగా పార్టీ డిజిటల్ సర్వర్‌కు చేరుతుంది,” అని స్పష్టం చేశారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై వైసీపీ తరచుగా ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ నడుస్తోందని ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ యాప్‌ను ప్రారంభించడం గమనార్హం. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేశ్ ‘రెడ్‌బుక్’ను ప్రవేశపెట్టారని గుర్తుచేస్తూ, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జగన్ స్పష్టం చేశారు.
“అన్యాయానికి గురైన వారందరూ యాప్ ద్వారా ఫిర్యాదులు చేయాలి. ఆధారాలు ఉన్న వీడియోలు, పత్రాలు అప్‌లోడ్ చేయాలి. తప్పు చేసిన వారందరికీ తగిన శిక్ష తప్పదు,” అని హెచ్చరించారు.
ఈ యాప్ ద్వారా ప్రజలకు నేరుగా పార్టీతో అనుసంధానం కలుగుతుందని, అన్యాయం ఎదుర్కొంటున్న వారికి ఇది బలమైన వేదిక అవుతుందని వైసీపీ నేతలు పేర్కొన్నారు.
Read More : శ్రీకాకుళంలో రామ్మోహన్ డ్యాన్స్ వైరల్?

One thought on “అన్యాయాలపై నేరుగా ఫిర్యాదు చేయండి: జగన్”
Comments are closed.