YS షర్మిల: చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డ ఏపీసీసీ చీఫ్
విజయవాడ, జనవరి 17: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై (AP CM Chandrababu Naidu) ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (APCC Chief YS Sharmila Reddy) ఘాటు విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో భారీగా ప్రచారం చేసిన సూపర్ సిక్స్ పథకాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. హామీలు ఇచ్చే ముందు రాష్ట్రం ఆర్థిక పరిస్థితిపై అవగాహన లేకుండా చర్యలు చేపట్టారంటూ ఆరోపించారు.
సూపర్ సిక్స్ ఆడలేక మద్దెల దరువు?
“ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు ప్రకటించిన బాబు, అమలుకు వచ్చినప్పుడు ఆదాయం పెరిగితేనే సాధ్యమని వెనుకంజ వేయడం ఏమిటి?” అని షర్మిల విమర్శించారు. అప్పులు దొరకవని, ఆదాయం పెంచాలని, తలసరి ఆదాయం పెరగాలని అంటున్న చంద్రబాబు మాటలు ప్రజల్ని గందరగోళానికి గురిచేస్తున్నాయన్నారు. “ఇది ఆడలేక మద్దెల దరువులా ఉంది” అంటూ చంద్రబాబుపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు.
సూటిగా ప్రశ్నలు
షర్మిల మాట్లాడుతూ, “సూపర్ సిక్స్ హామీలు ఇచ్చే ముందు రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని తెలియదా? ఆ హామీలను అమలు చేయాలంటే ఏటా రూ.2 లక్షల కోట్లు అవసరం అవుతుందని తెలుసుకోకుండా హామీలను ఎందుకు ఇచ్చారు? రాష్ట్ర బడ్జెట్ మొత్తం వినియోగించినా నిధుల కొరత ఉంటుందని తెలియనిదేనా?” అంటూ ప్రశ్నించారు.
ప్రత్యేక హోదాపై డిమాండ్
రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా అనేది కీలకమని, హోదాతోనే పరిశ్రమలు వస్తాయని, నిధులు పెరుగుతాయని, యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని షర్మిల స్పష్టం చేశారు. ప్రజలు నమ్మి ఓటేసి అధికారం ఇచ్చినా, హామీలను అమలు చేయలేకపోవడం దారుణమన్నారు.
చంద్రబాబు తీరు పై విమర్శలు
“ప్రధానమంత్రి మోదీకి మద్దతు ఇచ్చినప్పుడు రాష్ట్రానికి న్యాయం జరగుతుందనే భావించారా? ప్రత్యేక హోదా విషయంలో మోదీతో చెట్టాపట్టాలేసుకోవడం ఎందుకు?” అంటూ చంద్రబాబు తీరు పట్ల షర్మిల అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన
రాష్ట్రంలో ప్రజల ఆదాయాన్ని పెంచాలని, నిరుద్యోగ సమస్యను తగ్గించాలని, రాష్ట్రాభివృద్ధి కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. “విజన్ల పేరుతో కాలయాపన చేయడం కాదు, ప్రత్యేక హోదా సాధించడమే రాష్ట్ర అభివృద్ధికి మార్గం” అంటూ వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..

One thought on “సూపర్ సిక్స్: హామీలు తీసి మడతపెట్టిన చంద్రబాబు పై షర్మిల ఫైర్”
Comments are closed.