వివేకా హత్యపై సునీత తీవ్ర స్థాయిలో స్పందన

వివేకా హత్య కేసులో మరోసారి రాజకీయ కలకలం రేగుతోంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత, ఆమె భర్త ఈ రోజు కడప ఎస్పీ అశోక్ కుమార్‌ను కలిసి హత్య కేసులో తాజా పరిణామాలపై చర్చించారు. నిందితుల బెయిలు రద్దు అంశంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ నేపథ్యంలో ఎస్పీని వారు కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సునీత మాట్లాడుతూ – గత రెండు రోజులుగా పులివెందులలో జరుగుతున్న సంఘటనలు తన తండ్రి హత్యను గుర్తుచేస్తున్నాయన్నారు. ‘‘గొడ్డలి వేటుతో చంపి, గుండెపోటు అని ప్రచారం చేశారు. అప్పట్లో టీడీపీ నేతలే హత్యకు పాల్పడ్డారని నమ్మబలికారు. పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్‌ను చెరిపేశారు,’’ అని ఆరోపించారు.

అదే సమయంలో ఒక లేఖ తీసుకొచ్చి, తన తండ్రిని ఆదినారాయణరెడ్డి, సతీశ్ రెడ్డి, బీటెక్ రవి హత్య చేశారని సంతకం పెట్టమన్నారని, కానీ తాను నిరాకరించానని తెలిపారు. ప్రస్తుతం జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూడా ఇదే తరహాలో వేధింపులు జరుగుతున్నాయని చెప్పారు.

‘‘గత ఆరేళ్లుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నా. అయినప్పటికీ ఇప్పటివరకు దోషులకు శిక్ష పడలేదు. తప్పు చేసినవారికి శిక్ష పడాల్సిందే. నన్ను, నా భర్తను హత్యకారులుగా చిత్రీకరించేందుకు కుట్రలు జరుగుతున్నాయి’’ అని వైఎస్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు.

Read More : విశాఖపట్నంలో గ్యాస్ సిలిండర్ పేలుడు

One thought on “వివేకా హత్యపై సునీత తీవ్ర స్థాయిలో స్పందన

Comments are closed.