భారత వస్త్ర పరిశ్రమకు భారీ దెబ్బ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం భారత వస్త్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారత వస్తువులపై ఏకంగా 50 శాతం సుంకం విధిస్తున్నట్లు ఆయన ప్రకటించడంతో వాల్‌మార్ట్, అమెజాన్, టార్గెట్, గ్యాప్ వంటి ప్రపంచ ప్రఖ్యాత రిటైల్ సంస్థలు భారత్‌ నుంచి ఆర్డర్లను తక్షణమే నిలిపివేశాయి. ఈ విషయాన్ని అమెరికా కొనుగోలుదారులు లేఖలు, ఈమెయిళ్ల ద్వారా భారత ఎగుమతిదారులకు శుక్రవారం అధికారికంగా తెలియజేశారు. పెరిగిన సుంకాల భారాన్ని పంచుకోవడంలో అమెరికన్ కంపెనీలు ఆసక్తి చూపకపోవడంతో, మొత్తం భారాన్ని భారత ఎగుమతిదారులే భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎగుమతి ఖర్చులు 30 నుంచి 35 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామం కారణంగా అమెరికాకు వెళ్లే ఆర్డర్లు 40 నుంచి 50 శాతం వరకు తగ్గిపోవచ్చని, ఫలితంగా భారత పరిశ్రమకు ఏటా సుమారు 4 నుంచి 5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.35 వేల కోట్ల) నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

వెల్‌స్పన్ లివింగ్, గోకల్‌దాస్ ఎక్స్‌పోర్ట్స్, ఇండో కౌంట్, ట్రైడెంట్ వంటి ప్రధాన ఎగుమతి సంస్థలు అమెరికా మార్కెట్‌పైనే 40 నుంచి 70 శాతం వరకు ఆధారపడి ఉండటంతో, వీటిపై ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ నిర్ణయం బంగ్లాదేశ్, వియత్నాం వంటి పోటీ దేశాలకు లాభం చేకూర్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఆ దేశాలపై అమెరికా కేవలం 20 శాతం సుంకమే విధిస్తోంది.

2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత టెక్స్‌టైల్స్, వస్త్రాల ఎగుమతుల విలువ 36.61 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇందులో అమెరికా వాటా 28 శాతం. ఈ పరిస్థితుల్లో భారత ఎగుమతిదారులు తీవ్ర గందరగోళంలోకి వెళ్లి, భవిష్యత్తు వ్యూహాలపై పునరాలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Read More : భారత్ పర్యటనకు రష్యా అధ్యక్షుడు పుతిన్..?

One thought on “భారత వస్త్ర పరిశ్రమకు భారీ దెబ్బ

Comments are closed.