విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ హింస

విజయవాడ నగరంలో శనివారం రాత్రి బ్లేడ్ బ్యాచ్ మళ్లీ హడావుడి సృష్టించింది. ప్రకాశ్ నగర్ సమీపంలోని శాంతినగర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే… గణేష్ అనే యువకుడు రాత్రి సమయంలో తన పనుల కోసం శాంతినగర్ వద్ద ఉండగా, బ్లేడ్ బ్యాచ్ సభ్యులు అతని వద్ద డబ్బులు డిమాండ్ చేశారు.

ఆయన డబ్బులివ్వడాన్ని నిరాకరించడంతో దుండగులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. చేతిలో ఉన్న బ్లేడ్‌తో గణేష్‌పై దాడి చేసి తీవ్ర గాయాలు కలిగించారు. అలాగే, మరో వ్యక్తిపై కర్రలతో కూడా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గణేష్ రక్తపు మడుగులో పడి కొట్టుకుంటూ ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.

అప్రమత్తమైన వైద్య సిబ్బంది గణేష్‌ను తక్షణమే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

బ్లేడ్ బ్యాచ్ కు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రజల్లో భయోత్పాతం నెలకొంది.

Read More : మోడల్ ఫొటోతో తెలుగు ఎన్ఆర్ఐకి బురిడీ కొట్టించి రూ.2.68 కోట్లు కొట్టేసిన అన్నాచెల్లెళ్లు