మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మంగళగిరి సీఐడీ (CID) అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల ప్రకారం ఆయనను మార్చి 12న ఉదయం 11 గంటలకు మంగళగిరి సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
కాకినాడ పోర్టు వాటాల బదిలీ వ్యవహారంలో విజయసాయిరెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనపై 506, 384, 420, 109, 467, 120(B) రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్లను సీఐడీ ప్రస్తావించింది. ఈ కేసులో విజయసాయిరెడ్డితో పాటు ఐదుగురిపై నిందితులుగా కేసు నమోదైంది. వీరిలో విక్రాంత్ రెడ్డి (A-1), విజయసాయిరెడ్డి (A-2), శరత్ చంద్రారెడ్డి (A-3), శ్రీధర్ (A-4), అరబిందో రియాల్టీ ఇన్ఫ్రా (A-5) ఉన్నారు.
కాకినాడ పోర్టు వాటాల విషయంలో తన వాటాలను అక్రమంగా బదిలీ చేయించుకున్నారనే ఆరోపణలతో కేవీ రావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐడీ అధికారులు విజయసాయిరెడ్డిని విచారణకు పిలిచారు.
ఈ కేసులో ఇప్పటికే విక్రాంత్ రెడ్డికి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు విజయసాయిరెడ్డి ఇప్పటికే ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే ఇప్పుడు సీఐడీ విచారణకు విజయసాయిరెడ్డి హాజరవుతారా లేదా? ఆయన తదుపరి కార్యాచరణ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.
గతంలో వైసీపీ నుంచి వైదొలగిన విజయసాయిరెడ్డి, తన ఎంపీ పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించారు. తాజాగా కేసులో విచారణకు సమన్లు జారీ కావడం ఆయనను మరోసారి వార్తల్లో నిలిపింది. ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తారా లేదా అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

One thought on “విజయసాయిరెడ్డికి సీఐడీ నోటీసులు: విచారణకు హాజరవుతారా?”
Comments are closed.