చైనా విద్యా వ్యవస్థలో మరో కీలక సంస్కరణ చోటుచేసుకుంది. ఆధునిక సాంకేతికతలో ప్రపంచానికి ముందుండేందుకు చైనా ప్రభుత్వం విద్యార్థులకు నూతన మార్గదర్శకాలు అందించేందుకు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో విద్యార్థులకు చిన్న వయస్సులోనే సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తోంది.
ఈ నూతన మార్పులో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు కృత్రిమ మేధ (Artificial Intelligence – AI) కోర్సును బోధించాలని చైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త కోర్సును చేర్చడం ద్వారా విద్యార్థులు చిన్న వయస్సులోనే సాంకేతికత పట్ల ఆసక్తిని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది.
ఈ కోర్సులో మౌలిక స్థాయి నుంచి మొదలుకుని కృత్రిమ మేధలోని ప్రాథమిక అంశాలు, ప్రోగ్రామింగ్, డేటా విశ్లేషణ, యంత్రాలతో మానవ సంబంధాలు, ఆటోమేషన్ వ్యవస్థలు, రోబోటిక్స్ వంటి అంశాలను విద్యార్థులకు బోధించనున్నారు. విద్యార్థుల ఆలోచన శక్తి, సమస్యల పరిష్కార నైపుణ్యాలు పెంపొందించేలా ఈ కోర్సును రూపొందించినట్లు అధికారులు తెలిపారు.
చైనా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా విద్యార్థులు భవిష్యత్ సాంకేతికతలో తమ పాత్రను చక్కగా నిర్వర్తించేలా అవగాహన పెంచుకునే అవకాశం కలుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చిన్న వయస్సు నుంచే విద్యార్థులు సాంకేతిక రంగంలో మకుటం లేని మాణిక్యాలుగా ఎదగడం ద్వారా చైనా సాంకేతిక ప్రగతిలో మరింత దూసుకుపోనుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఈ కొత్త విధానం ద్వారా విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవగాహన పెంచుకునేందుకు అవకాశం దొరుకుతుందని చైనా విద్యా శాఖ అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ నుంచి ప్రారంభమయ్యే ఈ కోర్సు చైనా విద్యావ్యవస్థలో ఓ కీలక మైలురాయిగా మారనుందని భావిస్తున్నారు.

One thought on “చైనాలో కొత్త పరిణామం: ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యార్థులకు ఏఐ కోర్సు ప్రవేశం”
Comments are closed.