తురకా కిశోర్ అరెస్ట్‌పై హైకోర్టు ప్రశ్నలు

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సన్నిహితుడు, మాచర్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ తురకా కిశోర్ కేసు మరోసారి హైకోర్టు తలుపుతట్టింది. వివిధ కేసుల్లో బెయిల్ మంజూరై గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన ఆయనను, వెంటనే మరో కేసులో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వెల్దుర్తి పోలీసులు గుంటూరు జైలు వద్ద కిశోర్‌ను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా, ఆయన భార్య సురేఖతో పాటు కుటుంబ సభ్యులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. రెంటచింతలలో నమోదైన హత్యాయత్నం కేసులో కిశోర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిరసనలు వ్యక్తం చేసిన వారిని పక్కకు జరిపి కిశోర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఈ పరిణామంపై కిశోర్ భార్య తురకా సురేఖ హైకోర్టులో అత్యవసర పిటిషన్ వేశారు. గుంటూరు జైలు నుంచి విడుదలైన తన భర్తను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. జస్టిస్ ఆర్. రఘునందన్ రావు, జస్టిస్ జె. సుమతితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది.

పిటిషనర్ తరపున న్యాయవాది రామ లక్ష్మణరెడ్డి వాదనలు వినిపిస్తూ, కిశోర్‌పై వరుస కేసులు నమోదు చేసి, ఒకదాంట్లో బెయిల్ రాగానే మరొకదాంట్లో అరెస్టు చేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటివరకు 12 కేసులు నమోదు చేశారని తెలిపారు. పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది విష్ణు తేజ వాదనలు వినిపిస్తూ, హత్యాయత్నం కేసులో కిశోర్‌ను అరెస్టు చేశామని వివరించారు. కిశోర్‌పై నమోదైన కేసుల వివరాలు, ఫిర్యాదులు అందిన తేదీలు, అరెస్టు చేసిన సమయం తదితర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని పల్నాడు జిల్లా ఎస్పీకి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

గత ఏడాది ఏప్రిల్ 8న జరిగిన ఘటనపై ఇప్పుడు కేసు నమోదు చేయడంపై ధర్మాసనం ప్రశ్నలు లేవనెత్తింది. ఈ పిటిషన్‌పై విచారణను ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేసింది.

Read More : విశాఖలో రూ.50 వేల కోట్లతో గూగుల్ భారీ డేటా సెంటర్

One thought on “తురకా కిశోర్ అరెస్ట్‌పై హైకోర్టు ప్రశ్నలు

Comments are closed.