జనసేన నుంచి నాగబాబు నామినేషన్

Nagababu Nomination

ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో జనసేన పార్టీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, జనసేన నేత నాదెండ్ల మనోహర్, పలువురు ఎమ్మెల్యేలు, కూటమి నేతలు పాల్గొన్నారు.

నామినేషన్ అనంతరం నాగబాబు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తన అభ్యర్థిత్వానికి మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అసలు నాగబాబును రాజ్యసభకు పంపుతారనే వార్తలు వచ్చినప్పటికీ, చివరికి ఎమ్మెల్సీగా ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మిగిలిన నాలుగు స్థానాల్లో పోటీ ఎవరికీ?

ఏపీలో మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకదానిపై స్పష్టత రాగా, మిగిలిన నాలుగు స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎమ్మెల్యే టికెట్ దక్కని నేతలతో పాటు కీలక నాయకులకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని టీడీపీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయా నేతలు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ను కలిసి తనకు అవకాశం కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.

కూటమి భాగస్వామ్యాన్ని పరిగణలోకి తీసుకుని మిగిలిన ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను త్వరలోనే ఖరారు చేయనున్నట్లు సమాచారం.

Read More