కేంద్ర మంత్రి బండి సంజయ్ టీటీడీ ఉద్యోగాల్లో అన్యమతస్థుల నియామకాలపై తీవ్రంగా స్పందించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వెయ్యికిపైగా అన్యమతస్తులు ఎలా ఉద్యోగాలు పొందారని ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారినా ఈ విధానం కొనసాగుతుండటాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. వెంటనే అన్యమత ఉద్యోగులను తొలగించాలని డిమాండ్ చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చిన బండి సంజయ్, శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. కరీంనగర్‌లో భూమిపూజ చేసిన స్థలంలో వెంటనే శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించాలని కోరారు. ప్రజలంతా ప్రశాంతంగా జీవించాలని, సనాతన ధర్మ పరిరక్షణకు అందరూ ఏకతాటిపై ఉండాలని పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు లేని పురాతన దేవాలయాలకు టీటీడీ నిధుల కేటాయింపుతో అభివృద్ధి చేయాలన్నారు. ప్రత్యేకంగా కొండగట్టు అంజన్న ఆలయం, ఇల్లందకుంట రామాలయానికి నిధులు విడుదల చేసి అభివృద్ధికి దోహదపడాలని సూచించారు.
టీటీడీలో అన్యమతస్థుల పట్ల కొనసాగుతున్న విధానం వల్ల ఆచార వ్యవహారాల్లో తేడాలు వస్తున్నాయని బండి సంజయ్ అన్నారు. స్వామిపై విశ్వాసం లేని వారిని జీతాలు ఇచ్చి ఉద్యోగాల్లో ఉంచడం అన్యాయమని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణ చేశారు. ‘‘బొట్టు పెట్టుకుని వెళితే మసీదుల్లో లేదా చర్చిల్లో ఉద్యోగాలు ఇస్తారా?’’ అంటూ ప్రశ్నించారు.
Read More : ఏపీ మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తు వేగం

One thought on “టీటీడీలో అన్యమత ఉద్యోగులపై బండి సంజయ్ ఆగ్రహం”
Comments are closed.