పరీక్ష రాసి వస్తుండగా ఘోర ప్రమాదం..

నిర్మల్ జిల్లా పెంబి మండలం లోతర్య తండాకు చెందిన బాణావత్ సుగుణ, రెడ్డి నాయక్‌ల కుమార్తెలు అశ్విని (19), మంజుల (17)లు హైదరాబాద్‌లో జరిగిన F-SET ప్రవేశ పరీక్ష రాయడానికి వెళ్లారు. పరీక్ష ముగిసిన తర్వాత వారు తిరిగి ఇంటికి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

వీరు ప్రయాణిస్తున్న కారు అకస్మాత్తుగా అదుపుతప్పి ఓ కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కాచెల్లెళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాదకర ఘటన తల్లిదండ్రులను కన్నీటి మున్నీటిలో ముంచింది.

ఇదిలా ఉండగా, మృతుల తండ్రి రెడ్డి నాయక్ గతంలో మలేషియాకు వలస వెళ్లి అక్కడ కంపెనీ మోసం కారణంగా కూలి పనులు చేస్తూ బతుకుతూ ఉన్నాడు. తన కూతుళ్ల మరణవార్త విని కన్నీరు మున్నీరయ్యాడు. స్వదేశానికి రావడానికి సరిపడా డబ్బుల్లేవని విలపించాడు.

ఈ విషయంపై బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ స్పందించి, రెడ్డి నాయక్‌తో ఫోన్‌లో మాట్లాడారు. తండ్రి బాధను స్వయంగా విన్న కేటీఆర్, తక్షణమే రెడ్డి నాయక్‌ను భారత్‌కు తీసుకురావడానికి ఏర్పాట్లు చేయాలని తన టీంకు ఆదేశించారు.

ఇక ఖానాపూర్ బీఆర్ఎస్ ఇంచార్జ్ జాన్సన్ నాయక్ మృతుల కుటుంబాన్ని పరామర్శించి, అంత్యక్రియలకు హాజరయ్యారు. ఈ విషాద ఘటనతో తండాలో విషాదఛాయలు అలముకున్నాయి.

Read More : సిబ్బంది నిర్లక్ష్యంపై బంధువుల ఆగ్రహం

One thought on “పరీక్ష రాసి వస్తుండగా ఘోర ప్రమాదం..

Comments are closed.