‘రోహిత్ వేముల చట్టం’ పై సీఎం రేవంత్ స్పందన

తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు, విద్యాసంస్థల్లో వివక్షను నిలిపేందుకు ప్రత్యేక చట్టం అవసరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా సూచించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై ముఖ్యమంత్రి రేవంత్ స్పందిస్తూ సోమవారం ట్వీట్ చేశారు.

ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి, హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని సందర్శించిన సందర్భంలో ఈ లేఖను చదివినట్టు వెల్లడించారు. రాహుల్ గాంధీ ఆలోచనలు తనను ఎంతో ప్రేరేపించాయని, దళిత విద్యార్థుల హక్కులను పరిరక్షించేందుకు తెలంగాణలో గౌరవంగా, బాధ్యతగా చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీ లేఖలో… రోహిత్ వేముల, పాయల్ తాడ్వీ, దర్శన్ సోలంకిలాంటి ఎంతో మంది యువత వివక్ష కారణంగా జీవితాన్ని కోల్పోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇలాంటి విషాద సంఘటనలు ఇకపై మరెప్పుడూ పునరావృతం కాకుండా, ప్రభుత్వాలు తక్షణం చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు.

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా విద్యాసంస్థల్లో దళిత విద్యార్థులకు ఎదురవుతున్న వివక్షను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రత్యేక చట్టం దోహదపడుతుందన్న ఆశాభావాన్ని రాహుల్ గాంధీ వ్యక్తం చేశారు.

కాగా, ఇటీవ‌లే ఈ అంశంపై రాహుల్ గాంధీ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కులకూ లేఖలు పంపిన సంగతి తెలిసిందే.

Read More : తెలంగాణలో గద్దర్ చలనచిత్ర అవార్డులు జూన్ 14న భారీ స్థాయిలో జరగనున్న వేడుక