ఏపీ లిక్కర్ స్కామ్‌పై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఏపీ లిక్కర్‌ స్కామ్‌పై విచారణ కొనసాగుతుండగా, ఈ కేసులో కీలక మలుపులు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ హయాంలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణంపై ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గట్టి ఆధారాలతో విచారణ జరుపుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులను ప్రశ్నించిన సిట్, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని కూడా విచారించి ఆయన నుంచి వాంగ్మూలం నమోదు చేసింది.

తాజాగా ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తాను ‘విజిల్‌ బ్లోయర్‌’ పాత్ర పోషించానని స్పష్టం చేశారు. స్కామ్‌లో చిక్కుకున్న దొంగలు, ఇంకా బయటపడని దొంగలు తప్పించుకునే ప్రయత్నంలో తన పేరును లాగుతున్నారని ఆరోపించారు.

‘‘ఏపీ మద్యం కుంభకోణంలో నా పాత్ర విజిల్‌ బ్లోయర్‌. దొరికిన దొంగలు, దొరకని దొంగలు తప్పించుకోవడానికే నా పేరును లాగుతున్నారు. స్కామ్‌తో నాకు ఎలాంటి ఆర్థిక లాభం లేదు. లిక్కర్‌ దొంగల బట్టలు ఇప్పటికే సగం విప్పారు, మిగిలినవాటిని కూడా విప్పే పనిలో పూర్తిగా సహకరిస్తాను’’ అంటూ విజయసాయిరెడ్డి తన ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్‌లో స్పష్టంచేశారు.

ఇక రాజ్‌ కసిరెడ్డి అరెస్ట్‌ తర్వాత విజయసాయిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. మద్యం కుంభకోణంలో ‘కర్త, కర్మ, క్రియ’ అన్నీ రాజ్‌ కసిరెడ్డే అని ఇటీవల ఆయన స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

ఈ స్కామ్‌పై విచారణ మరింత వేగంగా కొనసాగుతుండగా, మరిన్ని నిందితుల పేరు బయటకు వచ్చే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

One thought on “ఏపీ లిక్కర్ స్కామ్‌పై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Comments are closed.