తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి 42 సార్లు వెళ్లినప్పటికీ రాష్ట్రానికి గణనీయమైన లాభం ఏమీ చేకూరలేదని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు విమర్శించారు. శనివారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ, తెలంగాణకు నష్టం జరుగుతున్నప్పటికీ సీఎం మౌనంగా ఉండటం దుర్మార్గమని ఆరోపించారు.
ఉపాధి హామీ కూలీలకు నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం ప్రభుత్వ బాహాట నిర్లక్ష్యానికి నిదర్శనమని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నరేగా పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని ఆరోపించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.12.22 కోట్ల పనిదినాలు మంజూరవగా, ఇప్పుడు కేవలం రూ.6.5 కోట్లకే పరిమితం చేయడాన్ని హరీష్ రావు నిరసించారు. కేంద్రం వెంటనే పనిదినాల సంఖ్యను పెంచాలని, రాష్ట్రం తక్షణమే కూలీలకు బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇక మరోవైపు పత్తి కొనుగోళ్ల వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఆయన ప్రకారం, పత్తి కొనుగోళ్లలో రూ.3,000 కోట్ల మేర అవినీతి చోటుచేసుకున్నదని తెలిపారు. ఈ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు.
రైతుల నుంచి క్వింటాల్ పత్తిని రూ.5,000కు కొనుగోలు చేసి, బ్రోకర్లు రూ.7,000కు పైగా అమ్ముకున్నారని వెల్లడించారు. పత్తి కొనుగోళ్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీసీఐ, మార్కెటింగ్ అధికారులు రైతులను మోసగించారని ఆరోపించారు. పత్తి కొనుగోళ్ల ఆలస్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు.
దీపావళి సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఓ రహస్య సమావేశంలో ట్రేడర్లతో కలిసి సీసీఐ అధికారులు ఈ వ్యవహారాన్ని కుట్రపూరితంగా నిర్వహించారని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నేతల సిండికేట్ వ్యవహారం వల్ల 80% మంది రైతులు నష్టపోయారని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టమైన స్పందన ఇవ్వాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Read More : అనర్హులకు ఇళ్లు కేటాయిస్తే కఠిన చర్యలు
