INS కోల్‌కతా, స్కార్పీన్ జలాంతర్గామి, ధ్రువ్ హెలికాప్టర్ అదరహో!

భారత నౌకాదళం (Indian Navy) తన శక్తి, సామర్థ్యాలకు నిదర్శనంగా నిలిచే గొప్ప దృశ్యాన్ని ‘ఎక్స్’ వేదికగా పంచుకుంది. సముద్ర తీరంలో గస్తీ చేపడుతున్న విధ్వంసక నౌక INS కోల్‌కతా, ఆధునిక స్కార్పీన్ తరగతి జలాంతర్గామి, తేలికపాటి ధ్రువ్ హెలికాప్టర్ ఒకేసారి ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తున్న ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

“భారత నేవీ త్రిశూల శక్తి – సముద్రంపై, సముద్రంలోని లోతుల్లో, అలలపై!” అనే నినాదంతో ఈ ఫొటోను భారత నౌకాదళం పంచింది. “Any Time, Any Where, Any How” అనే శక్తివంతమైన క్యాప్షన్‌తో తమ అపార శక్తిని ప్రపంచానికి తెలియజేసింది.

ఇటీవల కశ్మీర్‌లో పహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రదాడి జరగడంతో భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఫొటోను విడుదల చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సముద్రపు రక్షణలో భారత నౌకాదళం ఎంత బలంగా ఉన్నదనే విషయం ఈ దృశ్యం స్పష్టంగా తెలియజేస్తోంది.

స్కార్పీన్ తరగతి జలాంతర్గాములు ఫ్రాన్స్ సహకారంతో తయారయ్యాయి. ఇవి స్టెల్త్ టెక్నాలజీతో తయారై శత్రు నౌకలపై నిశ్శబ్దంగా దాడి చేయగలిగే సామర్థ్యం కలిగి ఉన్నాయి. నిఘా, మైన్ అమరిక, శత్రు యుద్ధనౌకల నిరోధం వంటి కీలక భాద్యతల్ని ఈ జలాంతర్గాములు సమర్థవంతంగా నిర్వర్తిస్తాయి.

ఇక INS కోల్‌కతా భారత నౌకాదళానికి చెందిన శక్తివంతమైన డిస్ట్రాయర్. ఇది నౌకాదళం తరఫున ముందుండే యుద్ధ నౌకలలో ఒకటి. భారత్‌ యొక్క సముద్ర సైనిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పే ఈ దృశ్యం నిజంగా గర్వకారణం.

Read More : కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు..