తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై ఎదురవుతున్న న్యాయపరమైన సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లారు. అక్కడ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో విస్తృతంగా చర్చించనున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30లోపు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం వచ్చింది. ఇప్పటికే బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండగా, ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద ఆమోదం కోసం ఉంది. ఈ పరిస్థితుల్లో న్యాయ నిపుణుల సూచనల మేరకు ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై కూడా న్యాయసలహా తీసుకోవాలని భావిస్తోంది.
ఇదిలా ఉండగా, ఢిల్లీ పర్యటన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు ఆగస్టు 27న బీహార్‌కి వెళ్ళనున్నారు. అక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టనున్న ఎన్నికల పాదయాత్రలో వీరు పాల్గొననున్నారు.
Read More : హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులు: మైక్రోసాఫ్ట్ కొత్త ఆఫీస్ లీజు
