తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజలు విశేషంగా స్పందిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. తాజాగా హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ 90కు పైగా స్థానాల్లో గెలిచి అధికారాన్ని నిలబెట్టుకుంటుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సామాజిక న్యాయానికి తమ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టంగా చెప్పారు. ముఖ్యమంత్రి పదవిని అగ్రవర్ణ నేతకు, పీసీసీ అధ్యక్ష పదవిని బీసీ వర్గానికి చెందిన తనకు, నాలుగు మంత్రివర్గ పదవులను దళితులకు, స్పీకర్ పదవిని మరో దళిత నేతకు కట్టబెట్టడమే ఇందుకు నిదర్శనమని వివరించారు.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడం లక్ష్యంగా “సామాజిక న్యాయ సమరభేరి” పేరుతో ఒక పెద్ద సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరవుతారని, గ్రామ స్థాయి నాయకులకు దిశానిర్దేశం చేస్తారని చెప్పారు.
కొత్తగా నియమించబడిన నేతలంతా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పార్టీ విజయానికి పాటుపడాలని మహేశ్ గౌడ్ పిలుపునిచ్చారు.
Read More : వలస కార్మికుల అవశేషాలపై కేటీఆర్ ఆగ్రహం
