తెలంగాణలో ప్రతినెలా రెండుసార్లు కేబినెట్ సమావేశాలు.

revanth-reddy

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతినెలా రెండుసార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి మంత్రివర్గ సమావేశం జరగాలని ఆయన స్పష్టం చేశారు.

ప్రజల కోసం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాల్లో ఆలస్యం కాకుండా చూసేందుకు, క్షేత్రస్థాయిలో అమలవుతున్న పథకాలను సమీక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ప్రతి నెలలో మొదటి, మూడవ శనివారాల్లో కేబినెట్ భేటీలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు 17 సార్లు కేబినెట్ సమావేశాలు జరిగాయి.

యాదాద్రి పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి

ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలో రూ.1,500 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందిరమ్మ ఇళ్లు సహా పలు సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించనున్నారు.

అనంతరం తుర్కపల్లి మండలంలోని తిర్మలాపురంలో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఈ సభకు సుమారు 60 వేల మంది హాజరవుతారని అంచనా. కాంగ్రెస్ పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

పర్యటనలో పాల్గొననున్న ప్రముఖులు

ఈ పర్యటనలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ తదితరులు సీఎం వెంట ఉండనున్నారు.

మధ్యాహ్నం 2.40కి బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి, 3 గంటలకు తిర్మలాపురానికి చేరుకుంటారు. 3.10 నుంచి 3.25 వరకు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, 3.25 నుంచి 4.40 వరకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం 4.45కి హైదరాబాద్‌కు తిరుగుతారు.

Read More : కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ విచారణ మళ్లీ ప్రారంభం.

One thought on “తెలంగాణలో ప్రతినెలా రెండుసార్లు కేబినెట్ సమావేశాలు.

Comments are closed.