జైనాబ్ రవ్జీతో వైభవంగా ఏడడుగులు

టాలీవుడ్ యువ కథానాయకుడు అక్కినేని అఖిల్ ఒక్కింటివాడయ్యారు. తన ప్రియురాలు జైనాబ్ రవ్జీతో శుక్రవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగిన వివాహ వేడుకలో ఏడడుగులు నడిచారు. గత ఏడాది నవంబరులో వీరి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. సినీ పరిశ్రమలో ఈ ఏడాది అత్యంత ఆసక్తికరంగా మారిన పెళ్లిలో ఇది ఒకటిగా నిలిచింది.

ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు ప్రశాంత్ నీల్, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ దంపతులు, దగ్గుబాటి కుటుంబ సభ్యులు తదితర ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అఖిల్ తండ్రి నాగార్జున, తల్లి అమల, వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులను స్వయంగా ఆహ్వానించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానం పలకడం ఈ వేడుకకు సామాజికంగా ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది.

వధువు జైనాబ్ రవ్జీ ప్రతిభావంతురాలైన ఆర్టిస్ట్, ఫ్రాగ్రెన్స్ క్రియేటర్. ఆమె రూపొందించే అబ్‌స్ట్రాక్ట్ ఆర్ట్ వర్క్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతేకాదు “Once Upon the Skin” అనే పేరుతో ఆమె నిర్వహించే ఫ్రాగ్రెన్స్ బ్లాగ్‌కు భారీ అనుచరులు ఉన్నారు. హైదరాబాద్‌లో జన్మించిన జైనాబ్, ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. ఆమె ప్రముఖ వ్యాపారవేత్తల కుటుంబానికి చెందినవారు. చిన్న వయసులోనే ఎం.ఎఫ్. హుస్సేన్ దర్శకత్వం వహించిన “Meenaxi: A Tale of Three Cities” చిత్రంలో నటించడం విశేషం.

ఇప్పటికే అఖిల్ నిశ్చితార్థం ప్రైవేట్‌గా జరగడం, గతంలో శ్రియా భూపాల్‌తో నిశ్చితార్థం రద్దవడం వంటి పరిణామాల నేపథ్యంలో, ఈ వివాహంపై అభిమానుల్లో భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది.

ఇక కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ వేడుక అనంతరం, జూన్ నెలాఖరులో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో మరో గ్రాండ్ రెసెప్షన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ పెళ్లి వేడుకకు దేశవ్యాప్తంగా మీడియా విశేష ప్రాధాన్యతనిచ్చింది. సినీ ప్రముఖులు, అభిమానులు కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Read More : రోడ్డు ప్రమాదంలో మలయాళ నటుడు షైన్ టామ్ చాకో తండ్రి మృతి