లోకేశ్ ఘాటు విమర్శలు: జగన్ వైఖరిపై మండిపాటు

నెల్లూరు, జూలై 7: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నెల్లూరులో టీడీపీ పట్టణ నియోజకవర్గ సమన్వయ సమావేశంలో పాల్గొన్న ఆయన, జగన్ పర్యటనల నేపథ్యంలో నిప్పులు చెరిగారు. “మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మా పార్టీకి చెందిన 164 మంది కార్యకర్తలు హత్యకు గురయ్యారు. అప్పుడే మేము భయపడలేదు. ఇప్పుడైతే అంతకంటే ఎక్కువ ధైర్యం ఉంది. ప్రతిపక్షంలోకి వచ్చినా జగన్ వైఖరిలో మార్పు లేదు. ఆయన ఎక్కడ పర్యటించినా ప్రజల ప్రాణాలు పోతున్నాయి. పల్నాడులో ఓ వ్యక్తిని పరామర్శించేందుకు వెళ్లిన జగన్ పర్యటనలో ముగ్గురు చనిపోయారు. ఓ కార్యకర్త కారు కింద పడి చనిపోతే కనీసం చూసే శ్రమ కూడా చేయలేదు” అని లోకేశ్ తీవ్రంగా విమర్శించారు.

వైసీపీ తీరుపై లోకేశ్ విమర్శలు

వైసీపీ పాలనపై మండిపడిన లోకేశ్.. “బ్లేడ్ బ్యాచ్‌, గంజాయి బ్యాచ్‌లను ప్రోత్సహిస్తున్నారని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఇంటి గేటుకే తాళ్లు వేసిన పార్టీ ఇప్పుడు ప్రజాస్వామ్యంపై ఉపదేశాలు ఇస్తోంది. తిరగమంటే ప్రజల ప్రాణాలు తీసే స్థాయికి వెళ్లిపోయారు. ఇది బాధాకరం” అన్నారు.

టీడీపీ కార్యకర్తలకు హితవు

“పార్టీలో మనల్ని బాధపడే ప్రధాన అంశం అలక. ప్రతి కార్యకర్త అలకను వదిలి పని చేయాలి. నాతో ఏవైనా అభిప్రాయభేదాలుంటే కూర్చొని మాట్లాడాలి. నమ్ముకున్న సిద్ధాంతాల కోసం పోరాడుతున్నా. చంద్రబాబు గారు నిర్ణయం తీసుకుంటే తలవంచి పని చేయాల్సిందే. పార్టీ ఫస్ట్, కార్యకర్త ఫస్ట్ అన్నది నా ధ్యేయం” అని లోకేశ్ తెలిపారు.

1500 మందిని కలిసిన లోకేశ్

సమావేశం అనంతరం నారా లోకేశ్ స్థానికంగా సుమారు 1500 మందిని కలిశారు. ప్రజలు, కార్యకర్తలు తనకు వినతిపత్రాలు అందజేయగా వాటిని పరిశీలించి పరిష్కారం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరితో కలిసి ఫోటోలు దిగారు.

సమావేశంలో పాల్గొన్న నాయకులు

ఈ కార్యక్రమంలో మంత్రి పి. నారాయణ, జిల్లా ఇంచార్జ్ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూఖ్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ అజీజ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, బీద రవిచంద్ర యాదవ్, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఏపీ ఖాదీ అండ్ ఇండస్ట్రీస్ బోర్డు ఛైర్మన్ కేపీ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Read More : వల్లభనేని వంశీకి అస్వస్థత

One thought on “లోకేశ్ ఘాటు విమర్శలు: జగన్ వైఖరిపై మండిపాటు

Comments are closed.