తెలంగాణ 2025-26 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ, వ్యవసాయం, ఆరోగ్యం, విద్యతో పాటు ఆరు గ్యారంటీల అమలుకు విస్తృతంగా నిధులు కేటాయించారు.
డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అంబేద్కర్ స్ఫూర్తితో పాలన కొనసాగుతుందన్నారు. కొంతమంది అబద్ధాలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి ప్రయత్నాలను తిప్పికొడుతూ ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు.
ఈ బడ్జెట్‌లో ఆధునిక వ్యవసాయ విధానాలను ప్రోత్సహించేలా నిధులు కేటాయించామని భట్టి పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించారని తెలిపారు. మూసీ ప్రాజెక్ట్ పునరుజ్జీవానికి కూడా నిధులు ఇచ్చామని వెల్లడించారు.
అదనంగా విద్య, వైద్యం, వ్యవసాయం, ఆరు గ్యారంటీలు, ట్రిపులార్, ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ వంటి అంశాలకు కేటాయింపులు జరిగాయని తెలిపారు. ముఖ్యంగా ఆరు గ్యారంటీల అమలులో మిగిలిపోయిన పథకాలను పట్టాలెక్కించే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించినట్లు భట్టి తెలిపారు.
ప్రసంగానికి ముందు డిప్యూటీ సీఎం భట్టి దంపతులు ప్రజాభవన్‌లోని నల్లపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ప్రజాభవన్ నుంచి అసెంబ్లీకి చేరుకుని సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకుని బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

One thought on “తెలంగాణ బడ్జెట్ 2025-26: అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత”
Comments are closed.