పేదలకు సన్నబియ్యం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ హామీపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులకు రేషన్ బియ్యం అందించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన మండిపడ్డారు.
కేటీఆర్ విమర్శలు:
హైదరాబాద్, మార్చి 19: తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి తనదైన శైలిలో విమర్శలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలవడం లేదని ఆయన మండిపడ్డారు. సన్న బియ్యం కొంటామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు రేషన్ బియ్యం సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తీవ్ర ఆరోపణలు చేశారు.
కేటీఆర్ ట్వీట్ వివరణ:
“కొండనాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడింది అన్నట్టు – సన్నబియ్యం కోసం చూస్తే దొడ్డుబియ్యం కూడా ఇయ్యలే” అంటూ ఎక్స్ వేదికగా మాజీ మంత్రి విరుచుకుపడ్డారు. రైతుల నుంచి సన్న బియ్యం కొనుగోలు చేయలేదని, రూ.500 బోనస్ కూడా ఇవ్వలేదని అన్నారు. మార్చి నెల నుంచి పేదలకు సన్నబియ్యం అందిస్తామని చెప్పిన ప్రభుత్వం పదో తేదీ దాటినా ఇప్పటివరకు రేషన్ బియ్యం కూడా ఇవ్వలేదని అసమర్థ పాలనను తీవ్రంగా విమర్శించారు.
ప్రభుత్వంపై విమర్శలు:
‘రైతులకు రుణమాఫీ కట్
రైతులకు రైతుభరోసా కట్
రైతులకు రైతుబీమా కట్
ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్ కట్
గర్భవతులకు న్యూట్రిషన్ కిట్ కట్
విద్యార్థినులకు హెల్త్ కిట్, ఎలక్ట్రిక్ స్కూటీ కట్
మహిళలకు నెలకు రూ.2500 మహాలక్ష్మి కట్
ఆఖరికి పేదలకు రేషన్ బియ్యం కట్
కాంగ్రెస్ అంటే కటింగ్
కాంగ్రెస్ అంటే కన్నింగ్’ అంటూ ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అంతే కాకుండా #CongressFailedTelangana అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు.

One thought on “సన్న బియ్యం ఎక్కడ? కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్”
Comments are closed.