ఎనిమిది రోజుల పర్యటనగా ఊహించిన అంతరిక్ష యాత్ర అనూహ్యంగా తొమ్మిది నెలలుగా మారింది. నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్ (Sunita Williams), బుచ్ విల్మోర్ (Butch Wilmore) అనుకోని పరిస్థితుల్లో 286 రోజులు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS) లోనే గడపాల్సి వచ్చింది. సాంకేతిక సమస్యల కారణంగా వారి యాత్ర మరింత సాగింది.
బుధవారం తెల్లవారుజామున 3:27 గంటలకు ఫ్లోరిడా సముద్ర జలాల్లో వీరిద్దరూ సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ఫ్రీడమ్ (SpaceX Crew Dragon Capsule Freedom) ద్వారా వారిని సురక్షితంగా భూమికి తీసుకువచ్చారు. ల్యాండింగ్ అనంతరం సహాయ బృందాలు సునీతా, విల్మోర్‌లను క్యాప్సూల్ నుంచి బయటకు తీసుకువచ్చి హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఈ 286 రోజుల ఐఎస్ఎస్ ప్రయాణంలో వారు గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించారు. దీంతో ప్రతి రోజూ 16 సార్లు భూమి చుట్టూ తిరిగారు. ఇది రోజుకు 16 సూర్యోదయాలు చూసినట్లే. ప్రత్యేకంగా చెప్పాలంటే ప్రతి 45 నిమిషాలకోసారి సూర్యోదయాన్ని వీరు వీక్షించారు. మొత్తం 286 రోజులలో వారు 4,500 సార్లు భూమి చుట్టూ తిరిగారు. ఈ ప్రయాణంలో 121 మిలియన్ స్టాట్యూట్ మైళ్లకు పైగా దూరాన్ని వీరు కవర్ చేశారు.
ఈ అనూహ్య ప్రయాణం మానవ సంకల్పానికి, పట్టుదలకు, జట్టు కృషికి నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

One thought on “ఎనిమిది రోజుల యాత్ర అనుకుని వెళ్లి 286 రోజులు అంతరిక్షంలోనే…”
Comments are closed.