సికింద్రాబాద్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ఒక్కోరోజు ఒక్కో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టుల సంఖ్య 24కి చేరింది. పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత నుంచి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. అక్రమ లావాదేవీలు, శిశు వ్యాపారం, భారీ ఆస్తుల సంగతులు తెలిసాయి. ఇప్పటికే ఆమెకు సంబంధించిన 8 బ్యాంకు ఖాతాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఖాతాల్లో, లాకర్లలో సుమారు రూ.30 కోట్ల విలువైన ఆస్తులున్నాయన్న అనుమానంతో గోపాలపురం పోలీసులు 2018 నుంచి ఇప్పటివరకు ఆమె ఆర్థిక లావాదేవీల వివరాలను బ్యాంకులను అడిగారు. విచారణలో డాక్టర్ నమ్రత 80 మంది శిశువులను సరోగసీ పేరిట విక్రయించిన విషయాన్ని అంగీకరించారు. పేద, గిరిజన కుటుంబాలకు డబ్బు ఆశ చూపి పిల్లలను కొనుగోలు చేసి, సంతానం లేని దంపతులకు సరోగసీ ద్వారా పుట్టినట్లు చెప్పి లక్షల రూపాయలకు విక్రయించారని తెలిపారు.
ఈ కేసులో మహారాష్ట్ర, గుజరాత్ (అహ్మదాబాద్), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శిశువుల చిల్డ్రన్ ట్రాఫికింగ్ గ్యాంగ్‌లతో డాక్టర్ నమ్రతకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఒక్కో శిశువును రూ.3 నుండి రూ.5 లక్షల వరకు కొనుగోలు చేసి, ఆ తర్వాత దంపతులకు రూ.18 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అమ్మినట్లు గుర్తించారు.
అలాగే, సృష్టి క్లినిక్ నుంచి స్వాధీనం చేసుకున్న రికార్డుల ఆధారంగా 200 మంది దంపతుల రిజిస్ట్రేషన్ వివరాలను పోలీసులు సేకరించారు. ప్రస్తుతం వీరి పూర్తి వివరాలను రాబట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Read More : తీన్మార్ మల్లన్నపై చర్యలకు NHRC ఆదేశం
