తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లాను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయడమే తన రాజకీయ లక్ష్యమని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. శనివారం (మే 18) కొత్తగూడెం, పాల్వంచలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి పర్యటించిన ఆయన, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన మూడు విద్యుత్ సబ్స్టేషన్లకు మంత్రి తుమ్మల, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంపీ రఘురామ రెడ్డి శంకుస్థాపన చేశారు.
తర్వాత మీడియాతో మాట్లాడుతూ…
► సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి పది నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తామన్నారు.
► సాగర్ నీరు అందకపోతే, రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా గోదావరి నీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.
► భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పారిశ్రామికంగా రాష్ట్రానికి మణిహారంగా నిలుస్తుందని అన్నారు.
► ఆయిల్ పామ్ సాగుకు రైతులు మొగ్గు చూపాలని, ఇది దీర్ఘకాలికంగా లాభదాయకం అవుతుందని సూచించారు.
► కొత్తగూడెం దేశంలో ఏకైక ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ స్థావరంగా మారిందని పేర్కొన్నారు.
► గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు కృషి జరుగుతోందని తెలిపారు.
► భద్రాద్రి రామాలయం దర్శనార్థం వచ్చే భక్తులకు సౌకర్యం కల్పించేందుకు రైల్వే లైన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
► టెంపుల్ టూరిజం, ఏకో టూరిజం, ఇండస్ట్రీ టూరిజం అభివృద్ధికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకెళ్తోందని, ప్రజల భాగస్వామ్యంతోనే రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
Read More : మంత్రివర్గ విస్తరణపై మహేష్ కుమార్ గౌడ్ స్పందన.

One thought on “సీతారామ ప్రాజెక్టు, ఆయిల్ పామ్ సాగుకు ప్రాధాన్యం.”
Comments are closed.