శ్రీలీలకు బాలీవుడ్‌లో వరుస అవకాశాలు

టాలీవుడ్‌లో అద్భుతమైన క్రేజ్ తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శ్రీలీల ఇప్పుడు బాలీవుడ్‌ దిశగా దూసుకెళ్తోంది. ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలను సొంతం చేసుకుంటోంది. ప్రతిష్టాత్మక హిట్ లవ్ ఫ్రాంచైజీ ‘ఆషికి-3’తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న శ్రీలీల, ఇందులో కార్తిక్ ఆర్యన్‌కు జోడీగా నటించనుంది. ఈ సినిమాను అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తుండగా, దీపావళికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

‘ఆషికి’ సిరీస్‌ ఇప్పటికే రెండు భారీ విజయాలను సాధించగా, మూడో భాగంపై భారీ అంచనాలున్నాయి. ఇలాంటి ప్రాజెక్ట్‌తో శ్రీలీల ఎంట్రీ ఇవ్వడం విశేషం. అంతేకాదు, ఈ సినిమా సెట్స్‌ పై ఉన్న సమయంలోనే యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన నటించబోయే మరో చిత్రానికి ఆమె సైన్ చేసింది. ఈ సినిమాను రాజ్‌ శాండియాలా డైరెక్ట్ చేస్తుండగా, ప్రముఖ నిర్మాత ఆనంద్ ఎల్. రాయ్ నిర్మిస్తున్నారు. శ్రీలీల నటన ఆయనకు నచ్చడంతో తన దర్శకత్వంలో కూడా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం.

ఇది పరిమితం కాకుండా శ్రీలీలకు ఇప్పుడు బాలీవుడ్‌లో బడా బ్యానర్ నుంచి కూడా ఆహ్వానం వచ్చింది. హిట్ ప్రాంచైజీ ‘దోస్తానా 2’లో హీరోయిన్‌గా శ్రీలీలను తీసుకునే ఆలోచనలో కరణ్ జోహార్ ఉన్నట్టు తెలుస్తోంది. మొదట కొన్ని దక్షిణాదినటుల పేర్లను పరిశీలించిన కరణ్, చివరికి శ్రీలీలను ఎంపిక చేశారని సమాచారం.

ఈ అవకాశాలు నిజమైతే, శ్రీలీల బాలీవుడ్‌లో సుదీర్ఘ కెరీర్‌కు బంగారు బాట పడినట్టే. టాలీవుడ్‌లో సాధించలేని స్థాయిని బాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే అందుకునే అవకాశముంది. ఆమె ఎనర్జీ, ఆకర్షణీయతకు నార్త్ ఆడియెన్స్ నుంచి మంచి స్పందన రావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతోందని చెప్పవచ్చు.

Read More : సాయిసూర్య, సురానా కేసులో కీలక మలుపు.

One thought on “శ్రీలీలకు బాలీవుడ్‌లో వరుస అవకాశాలు

Comments are closed.