అంతరిక్షంలోకి వెళ్ళిన రెండో భారతీయుడిగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)ని సందర్శించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా నిన్న స్వదేశానికి తిరిగి వచ్చారు. ఏడాది పాటు అమెరికాలో శిక్షణ పొంది, యాక్సియమ్-4 మిషన్లో భాగంగా విజయవంతంగా అంతరిక్ష యాత్రను పూర్తి చేసుకున్న ఆయనకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. కుటుంబ సభ్యులు, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు జాతీయ జెండాలతో ఆయనకు స్వాగతం పలికారు.
ఈ రోజు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. న్యూఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో సాయంత్రం 5 గంటల నుంచి 5:30 గంటల మధ్య ఈ భేటీ జరగనుంది.
అంతరిక్షం నుంచి ప్రధానితో సంభాషణ
జూన్ 25న ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరిన యాక్సియమ్-4 మిషన్‌లో శుభాంశు శుక్లా పైలట్‌గా వ్యవహరించారు. జూన్ 26న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. అప్పట్లో ఆయన అంతరిక్షం నుంచే ప్రధాని మోదీతో సంభాషించారు. ఆ సందర్భంగా, తన శిక్షణ, అనుభవాలను భవిష్యత్ మిషన్ల కోసం డాక్యుమెంట్ చేయాలని శుక్లాను ప్రధాని కోరారు. భారత స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో కూడా ప్రధాని మోదీ శుభాంశు శుక్లా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం.
Read More : ఢిల్లీలో మరో పాఠశాలకు బాంబు బెదిరింపు

One thought on “అంతరిక్ష యాత్రికుడు శుభాంశు శుక్లాకు ఘన స్వాగతం”
Comments are closed.