ముంబైలో ఈరోజు ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి థానే జిల్లాలోని కసార ప్రాంతానికి వెళ్లే లోకల్ రైల్లో ప్రమాదం సంభవించింది. బోగీలు పూర్తిగా కిక్కిరిసిపోయిన కారణంగా, ఫుట్‌బోర్డ్ పై వేలాడుతూ ప్రయాణించిన కొంతమంది ప్రయాణికులు రైలు నుంచి జారిపడ్డారు.
ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు దుర్మరణం చెందారు. మరొక 12 మంది కిందపడిపోయినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఘటనాస్థలంలోనే ఐదుగురు మృతిచెందగా, మిగతా వారు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్యసహాయం అందిస్తున్నారు.
రైలు బోగీలలో తీవ్రమైన రద్దీ ఉండటం వల్ల ప్రయాణికులు డోర్ల వద్ద వేలాడుతూ ప్రయాణించాల్సి వచ్చింది. అదే సమయంలో ట్రైన్ వేగంగా కదులుతుండగా, అదుపుతప్పిన వారు కిందపడినట్లు తెలుస్తోంది.
ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే శాఖ విచారణ ప్రారంభించింది. ముంబై లోకల్ ట్రైన్లలో తరచూ ఎదురయ్యే రద్దీ సమస్య మరోసారి ప్రాణాల మీదకు తెచ్చిందని ఈ ఘటన బహిర్గతం చేసింది.
అదనంగా, ప్రయాణికుల భద్రత విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం తలెత్తింది.
Read More : చినాబ్ వంతెన ప్రారంభంతో జమ్మూ కశ్మీర్ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోదీ
