శ్రీహరికోట షార్‌లో తీవ్రవాదులు? భద్రతా బలగాల విస్తృత తనిఖీలు

నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రం (షార్)లో తీవ్రవాదులు ఉన్నారనే సమాచారం కలకలం రేపుతోంది. గత అర్ధరాత్రి తర్వాత చెన్నై కమాండ్ కంట్రోల్‌కు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి, షార్‌లో బాంబులు పెట్టారు, తీవ్రవాదులు చొరబడ్డారు అంటూ సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా అధికారులు వెంటనే చర్యలకు దిగారు.

ఈ నేపథ్యంలో శ్రీహరికోట పరిసరాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచి నెల్లూరు జిల్లా పోలీసులు, సీఐఎస్‌ఎఫ్ బలగాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సీఐఎస్‌ఎఫ్ బలగాలు ప్రత్యేకంగా టీంలుగా ఏర్పడి అడవుల్లో కూంబింగ్ నిర్వహించగా, సముద్ర మార్గాల్లో కోస్టల్ గార్డ్ తనిఖీలు నిర్వహించారు. షార్ మొదటి గేటు, ఉద్యోగుల కాలనీల్లోనూ నాయుడుపేట డీఎస్పీ చెంచు బాబు ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చర్యలు కొనసాగించారు.

షార్‌కు కేవలం ఒకే మార్గం ఉండటంతో భద్రతా సిబ్బంది ప్రతి కోణంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శ్రీఅంతరిక్ష ప్రయోగాల్లో భారత్ వేగంగా ముందుకెళ్తున్న వేళ, ఎలాంటి ప్రమాదం సంభవించకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. కంట్రోల్ రూంలు, ఉద్యోగుల నివాసాలు, అడవులు అన్ని ప్రాంతాలనూ జల్లెడ పడుతున్నారు.

ఇదే సమయంలో సముద్ర మార్గం ద్వారా ఎవరికైనా చొరబాటుకి ప్రయత్నం జరిగిందా అన్న కోణంలోనూ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నారు. షార్ చుట్టూ ఉన్న మత్స్యకార గ్రామాలకు చెందిన ప్రజలను కూడా పోలీసులు ప్రశ్నిస్తూ అవసరమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు.

ప్రస్తుతం మెయిన్ గేటుపై భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంతోపాటు, ఎవరికీ లోపలికి అనుమతి ఇవ్వకుండా గట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నానికి ఈ ఫోన్ కాల్ నిజమా? లేదంటే ఓ ఆకతాయిల పని తలెత్తిందా అన్న అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే అధికారులు తీవ్రవాదులు చొరబడ్డ అవకాశాలు తక్కువేనని అంచనా వేస్తున్నారు.

Read More : విదేశీ పర్యటనకు సిద్ధమైన ప్రధాని మోదీ

2 thoughts on “శ్రీహరికోట షార్‌లో తీవ్రవాదులు? భద్రతా బలగాల విస్తృత తనిఖీలు

Comments are closed.