ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (కల్వకుంట్ల తారకరామారావు) సోమవారం ఉదయం ఏసీబీ (ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ) విచారణకు హాజరయ్యారు. బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్‌ను అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన విచారణకు తీసుకువెళ్లారు.
ఫార్ములా-ఈ రేస్ నిర్వహణలో నిధుల దుర్వినియోగం, విదేశీ కంపెనీకి నగదు బదిలీ జరిగిన అంశాలపై ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు. ముగ్గురు అధికారులు కలిసిన ప్రత్యేక బృందం విచారణను నిర్వహిస్తోంది. ఎఫ్‌ఈవో కంపెనీకి నగదు బదిలీ వ్యవహారంలో ఆ సంస్థ ప్రతినిధులను ఏసీబీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. ప్రస్తుతం ఆ స్టేట్‌మెంట్ ఆధారంగా కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు.
ఈ విచారణ నేపథ్యంలో ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కార్యాలయం పరిసరాలకు అనుమతి లేకుండా ఎవరినీ లోనికి అనుమతించలేదు. కేటీఆర్‌తో వచ్చిన బీఆర్‌ఎస్ కార్యకర్తలను పోలీసులు నీలోఫర్ ఆసుపత్రి సమీపంలో అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, తనను విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. ‘‘ఎన్ని సార్లు పిలిచినా విచారణకు హాజరవుతాను. చట్టాలు, న్యాయవ్యవస్థపై నాకెప్పుడూ గౌరవం ఉంది. సత్యం నిలకడ మీదే తెలుస్తుంది. జైలుకెళ్లాల్సి వచ్చినా భయపడే ప్రసక్తే లేదు. వెనక్కి తగ్గేది లేదు. కాంగ్రెస్ హామీలు, డిక్లరేషన్లను ఎండగడుతూనే ఉంటాను’’ అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా? అనే సవాలు విసిరారు. చివరగా తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్‌ఎస్సే అన్నారు.
Read More : హైదరాబాద్‌లో గద్దర్ తెలంగాణ అవార్డుల అంగరంగ వైభవం

2 thoughts on “ఫార్ములా ఈ కేసులో ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్”
Comments are closed.