విమాన ప్రమాద బాధిత కుటుంబాల ఆవేదన

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని కలచివేసిన సంగతి తెలిసిందే. ఈ ఘోర ఘటనలో సుమారు 270 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలు మరో వేదనను ఎదుర్కొంటున్నాయి. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, నకిలీ వీడియోలు, ఫేక్ పోస్టులతో తమను మరింత మానసికంగా కుంగిపోయేలా చేస్తున్నారని బాధితుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కోమి వ్యాస్ కుటుంబానికి చెందిన కజిన్ కులదీప్ భట్, ఈ వ్యవహారంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను విజ్ఞప్తి చేశారు. ‘‘దయచేసి ఇలాంటి అసత్య ప్రచారాలు ఆపండి. లైకులు, వ్యూస్ కోసం మా బాధను ఇలా మ‌రింత పెంచకండి’’ అంటూ కోరారు.

కోమి వ్యాస్‌తో పాటు ఆమె భర్త ప్రతీక్ జోషి, వారి ముగ్గురు పిల్లలు ప్రద్యుత్, నకుల్, మిరాయా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన నుంచి కుటుంబం తేరుకోకముందే కొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని కులదీప్ భట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన అసలు వీడియోలను దుర్వినియోగం చేయడంతో పాటు, మార్ఫింగ్ చేసిన ఫోటోలు, కృత్రిమ మేధ (AI) సాయంతో నకిలీ వీడియోలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారని ఆయన వివరించారు.

కోమి విమానం ఎక్కే ముందు తన కుటుంబంతో తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు వైరల్ అవుతుండటంతో పాటు, ఆ ఫోటో ఆధారంగా కూడా వదంతులు వ్యాప్తి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కోమి కుమార్తె మిరాయా గురించి కూడా తప్పుడు కథనాలు ప్రచారం అవుతున్నాయని, ‘‘ఆ పాప మృతదేహం కాలిపోయిందని, అంత్యక్రియలు జరుగుతున్నాయని తప్పు సమాచారం వస్తోంది. అయితే, ఇంకా డీఎన్ఏ పరీక్షలు పూర్తవ్వలేదు’’ అని వివరించారు.

అంతేకాదు, కోమి పేరుతో ఫేక్ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి, ఆమె ఫోటోలను కూడా దుర్వినియోగం చేస్తున్నారని భట్ వాపోయారు. ప్రమాదంలో మరణించిన పిల్లల మృతదేహాలు చూపిస్తున్నట్టు చెబుతున్న కొన్ని వీడియోలు వాస్తవానికి వేరే పాత ఘటనకు సంబంధించినవని కూడా ఆయన స్పష్టం చేశారు.

‘‘దయచేసి మేము ఎదుర్కొంటున్న బాధను గౌరవించండి. నిజమైన సమాచారం కావాలంటే అధికారులను సంప్రదించండి. అవసరమైతే మేమే ఫోటోలు, వీడియోలు ఇస్తాం. కానీ మీ పాపులారిటీ కోసం బాధిత కుటుంబాల బాధను మరింత పెంచకండి’’ అని కులదీప్ భట్ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లను కోరారు.

Read More : శ్రీహరికోట షార్‌లో తీవ్రవాదులు? భద్రతా బలగాల విస్తృత తనిఖీలు

One thought on “విమాన ప్రమాద బాధిత కుటుంబాల ఆవేదన

Comments are closed.